ప్రస్తుతం సినీరంగంలో రాణిస్తున్న కొందరు నాయికలు అందం, అభినయంతో పాటు స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్ గ్రౌండ్‌తో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వారిలో కొందరు వైద్యవిద్యను పూర్తి చేసి వెండితెరపై సత్తాచాటుతున్నారు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాననే నానుడిని నిజం చేస్తూ ఈ అందాల భామలు టాలీవుడ్లో తమదైన ముద్ర వేస్తున్నారు. వీరిలో దక్షిణాది నాయికలే ప్రముఖంగా కనిపిస్తుండటం విశేషం. కొందరు ఎంబీబీఎస్ పూర్తి చేసి సినీరంగంలో అడగుపెట్టగా, మరికొందరు సినిమాల్లో నటిస్తూనే వైద్య విద్యను పూర్తి చేశారు. ఇలా వైద్య వృత్తి నుంచి సినిమాల్లోకి వచ్చిన అందాల నాయికల గురించిన ఆసక్తికరమైన విశేషాలివి..
‘ఫిదా’తో (2017) తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తమిళ సోయగం సాయిపల్లవి. ఆమె అంతకు ఏడాది ముందే జార్జియాలోని టిబిలిస్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టానందుకుంది. దక్షిణాది సినీరంగంలో అనతికాలంలోనే వరుస విజయాలతో తిరుగులేని గుర్తింపురావడంతో వైద్య వృత్తికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (ఎఫ్ఎమ్జీఈ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, వైద్య వృత్తిని చేపట్టడానికి పూర్తి అర్హత సాధించినప్పటికీ నటనకే అంకితమైపోయింది. అయితే ఈ భామ ప్రజారోగ్యానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నది. సౌందర్య ఉత్పత్తులు, ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వాడకాన్ని అస్సలు ఇష్టపడని ఈ భామ వాటి ప్రచారానికి కూడా దూరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. బలమైన వ్యక్తిత్వం, సహజసిద్ధమైన అందమే మహిళలకు నిజమైన ఆభరణాలని సాయిపల్లవి ఎప్పుడూ చెబుతుంటుంది.
నాలుగేళ్ల క్రితం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పంజాబీ భామ మీనాక్షి చౌదరి. గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలతో యువతకు చేరువైంది. ఆమె పంజాబ్‌లోని నేషనల్ డెంటల్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డెంటర్ సర్జరీ (బీడీఎస్) పూర్తి చేసింది. డెంటిస్ట్రీ మూడో సంవత్సరంలో ఉండగానే మాడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆపై సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకుంది. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే డెంటిస్ట్‌గా సక్సెస్ అయ్యేదాన్నని, సినిమాల్లో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. వైద్య విద్యను ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదని పలు సందర్భాల్లో చెప్పింది మీనాక్షి చౌదరి.
అచ్చ తెలుగందం శ్రీలీల ఎంబీబీఎస్ డిగ్రీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆమె ముంబయిలోని డీవై పాటిల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎంబీబీఎస్ పట్టాను స్వీకరించింది. ఈ భామ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, మెడిసిన్‌లో అడ్మిషన్ తీసుకోవడం ఒకేసారి జరిగింది. గత ఆరేళ్లుగా దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది శ్రీలీల. అయినా ఆమె చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఓవైపు షూటింగ్స్‌లో పాల్గొంటూనే మరోవైపు క్లాసులకు హాజరయ్యేది. సినిమా, అకాడమిక్స్ను బ్యాలెన్స్ చేస్తూ ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సిద్ధమై విజయాన్ని సాధించింది. ఈ సొగసరి కాన్వొకేషన్ వేడుక తాలూకు ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వైద్య విద్యను, యాక్టింగ్ కెరీర్‌ను సమర్థంగా బ్యాలెన్స్ చేసిందని ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘చక్కటి సంకల్ప బలం, సహనం ఉంటే ఏదైనా సాధ్యమే. అన్నిటికన్నా ఏకాగ్రత ముఖ్యం. మెడిసిన్, యాక్టింగ్.. రెండు వృత్తుల్ని నేను ఆస్వాదించాను. డాక్టర్ కావాలన్నది నా ఆశయం. అది నెరవేర్చుకున్నా’ అని శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో ఆనందం వ్యక్తం చేసింది.

ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితిశంకర్ చెన్నైలోని రామచంద్ర యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ను పూర్తి చేసింది. కార్తీ హీరోగా నటించిన ‘విరుమాన్’ (2022) చిత్రంతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిందీ భామ. శివకార్తీకేయన్‌తో కలిసి నటించిన ‘మావీరన్’తో తమిళనాట మంచి గుర్తింపును సంపాదించుకుంది. ‘భైరవం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కొన్నేళ్ల క్రితం సర్జికల్ డ్రెస్‌లో ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఎప్పటికైనా సర్జన్‌గా రాణించాలన్నది తన లక్ష్యమని చెబుతుంటుంది అదితిశంకర్.
మలయాళ సినీరంగంలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్నది ఐశ్వర్యలక్ష్మి. సినీరంగంలోకి రాకముందే ఈ భామ ఎర్నాకులంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఎంబీబీఎస్ పట్టా అందుకుంది. అక్కడే ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసింది. 2017లో ‘నిజందుకడులే నట్టిల్ ఒండవేళ’ చిత్రంతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన ఆమె వరుస సినిమాలతో అగ్ర నాయికగా ఎదిగింది. తమిళంలో కూడా ఈ భామకు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో నటిస్తున్నది ఐశ్వర్యలక్ష్మి. నటిగా కంటే తాను డాక్టర్ అని చెప్పుకోవడానికి గర్విస్తానని, భవిష్యత్తులో తప్పకుండా వైద్య వృత్తిలోనే స్థిరపడతానని పలు ఇంటర్వ్యూలో ఐశ్వర్యలక్ష్మి చెప్పుకొచ్చింది.