– డి.ఎం. వినోద్, బాలానగర్.
అందరికీ ఎత్తు అనగానే.. నైరుతి అనేది మనసులో నాటుకు పోయింది. కానీ, ఒక్కోదానికి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. ఎత్తును కలిగి ఉన్న దాని ప్రాముఖ్యతను గుర్తించి, స్థానం నిర్ధారించాలి. మనిషి ఒడ్డు పొడవు కాదు.. అతని సామర్థ్యం కదా చూడాలి. సాధారణంగా ఫ్యాక్టరీలలో ఉత్పత్తి చేసే పరికరాలు, తదితర అంశాలను బట్టి మిషినరీ పెట్టే విధానంలో ఒక ప్రాసెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఒక గొయ్యి-ఎత్తు విరుద్ధ దిశలలో రావడం తప్పదు. అలాంటి చోట ఫ్యాక్టరీ పూర్తి లక్ష్యం నెరవేరడానికి శాస్ర్తాన్ని జోడించాలి. విడివిడిగా చూడకూడదు. ఇలాంటి చోట నైరుతిలోనే చిమ్నీ పెట్టాలి అనే ఎత్తు సూత్రం కాదు. అది ఆగ్నేయం-వాయవ్యాలలోనే పెట్టాల్సి వస్తుంది. తత్ గుణం-తత్ స్థానం చూడాలి. మీరు నైరుతి అని ఆలోచించకుండా.. ఆగ్నేయంలో నిర్మించండి. అలాగే తప్పనిసరిగా నైరుతి స్థానంలో మీ ఆఫీస్‌ను నిర్మించి, అందులో నుంచి ఫ్యాక్టరీని నడిపించండి. అది
అనివార్యం.
– ఎ. సుభద్ర, వేములవాడ.
బయటి ఆవరణం గృహస్తు చేతిలో ఉండదు. ఇల్లు కట్టకముందు, స్థలం ఎంపికలోనే జాగ్రత్తగా పరిశీలించ గలిగితే.. మంచి స్థలం ఎంచుకోవచ్చు. పశ్చిమం రోడ్డు పల్లంగా ఉంటే అపకీర్తి, ఆర్థిక నష్టాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ పడమర రోడ్డు దక్షిణం దిశగా చాలా పల్లంగా వెళ్తున్నదని చెప్పారు.

అంటే, నైరుతి గొయ్యి ప్రభావాన్ని ఇచ్చేలా అది స్లోపుగా సాగిపోయినట్లయితే.. అకాల ప్రమాదాలు, అనుకోని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. మీరు తెలిసిన వారిచేత చూపించుకొని నిర్ణయం తీసుకోండి. మరీ లోతుగా సాగే గోతుల వంటి రోడ్డున్న గృహంలో ఎల్లకాలం ఉండటం మంచిదికాదు. ఇప్పటికే మీరు ఎన్నో సమస్యలు అనుభవించి ఉంటారు. బాగా లేనప్పుడు ఇల్లు మార్చేయండి.
– వి. చంద్రకళ, చెర్ల.
అంతస్తులు ఎన్ని కడితే.. అన్ని మాస్టర్ బెడ్రూములు వస్తాయి. ప్రధాన పడక గది కిందనే ఉండాలనే నియమం అవసరంలేదు. యజమాని ఇష్టాన్ని బట్టి ఏ అంతస్తులోనైనా ఉండవచ్చు. ఇంటిలోని పడక గదులకు, ప్రధానంగా నైరుతి పడక గదికి బెడ్రూమ్ కొలతను బట్టి తూర్పు-ఆగ్నేయంలో లేదా పడమర-వాయవ్యంలో ఏర్పాటు చేసుకోవాలి. అన్ని గదుల కన్నా నైరుతి పడక గదిని పెద్దదిగా చేసి, టాయిలెట్ సెక్షన్‌ని నిద్రించే పరిధిని దాటించి, ఆగ్నేయం, వాయవ్యంలో సరైన కొలతలతో నిర్మించాలి. దీనిలో డ్రెస్సింగ్ రూముని కలిపినప్పుడు నైరుతిలో బరువు ఉండాలని డ్రెస్సింగ్ ఏరియాకు డోర్ పెట్టకుండా ఏర్పాటు చేయాలి. గదిలో మరో గదిని కట్టకూడదు. అలా ప్రత్యేకంగా డ్రెస్సింగ్ ఏరియా కావాలి అంటే.. తూర్పు-ఆగ్నేయంలోనే ప్లాన్ చేయాలి. ఏదైనా తెలిసి లేదా తెలుసుకొని చేయండి. ఇబ్బందులు ఉండవు.
– కె. మాధవి, ఎల్కతుర్తి.
ఏ ముఖ ద్వారం ఉన్న ఇంటికైనా.. ఉత్తరం త్రెంపు మంచిదికాదు. ఈశాన్యం కార్ పార్కింగ్ అనీ, ఉత్తరం లాన్ కోసమనీ.. ఆ దిశలను కట్ చేయవద్దు. ప్రధానంగా గృహంలో ఉత్తరం స్త్రీ స్థానం, సంపత్తి స్థానం. ఈ దిశ ఇంటిలో కలిసి ఉండాలి. అది లోపించినప్పుడు గృహంలో ఆర్థిక సమస్యలు, స్త్రీలకు అనారోగ్యం, ముఖ్యంగా గర్భకోశానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతానలోపం కూడా ఉంటుంది.

చాలామంది ఇంటిని డూప్లెక్స్గా కట్టి, ఉత్తరంలో ‘యూ’ ఆకారంగా నిర్మిస్తున్నారు. అప్పుడు ఇంటికి గర్భస్థానం లేకుండా పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం త్రెంపు చేయరాదు. మీ గృహం అలా ఉంటే.. వెంటనే ఆ భాగాన్ని ఇంటిలోకి కలిపి, పైన స్లాబ్ వేయాలి. ఉత్తరం ద్వారం వచ్చేలా ఉత్తరం పారును కలిపి గోడ కట్టాలి. ఇల్లు పూర్ణంగా ఉండాలి అంటే.. అన్ని మూలలు తెగకుండా నిర్మాణం చేయాలి. అప్పుడే అది సరైన గృహం అవుతుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143