జగిత్యాల, జూన్ 6(నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి రాష్ర్టాన్ని సాధించింది కేసీఆర్. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఆయన నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా ఇదే మాట వినిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ సీఎం కావడం తథ్యం’ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఉద్ఘాటించారు. శనివారం జగిత్యాలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాగునీటి రంగానికి విశేష ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సాగు, తాగునీరుతో పాటు, పరిశ్రమలకు, హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును నిర్మించారన్నారు. రేవంత్‌రెడ్డికి కలలో సైతం కాళేశ్వరం, కేసీఆర్ కనిపిస్తున్నారన్నారు. మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేసి, వినియోగంలోకి తెస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందో అన్న భయంతోనే రేవంత్‌రెడ్డి పనులు చేయించడం లేదని మండిపడ్డారు.
ఎప్పుడు చూసినా ఫ్యూచర్ సిటీ ఆదాయం.. తన ఫ్యూచర్‌పై ఆరాటం ఉందే తప్ప తెలంగాణ ప్రజల ఫ్యూచర్‌పై పట్టింపులేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం పడే అవకాశాలున్నాయని, కరువు వస్తే మాత్రం రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి కడుతామని, ఒప్పందం కోసం ప్రయత్నిస్తే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి అసమర్థ సీఎం ప్రపంచంలో ఎక్కడా ఉండరని విమర్శించారు. ఇక్కడ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్‌రావు, బీఆర్ఎస్ నాయకులు గాజుల రాజేందర్, దుర్గయ్య, రాజేందర్, శీలం ప్రవీణ్, దర రమేశ్‌బాబు, వెంకటేశ్వర్రావు, రాంమోహన్‌రావు పాల్గొన్నారు.