ఉస్మానియా యూనివర్సిటీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై నిండు కోర్టులో జరిగిన దాడి గర్హనీయమని మాల సంఘాల నాయకులు అన్నారు. దాడిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ.. మంత్రి అడ్లూరిపై పొన్నం అహంకారపూరిత మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని దళిత సమాజానికి క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచిపోయినా రేవంత్‌రెడ్డి స్పందించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
పొన్నం తక్షణమే క్షమాపణ చెప్పకపోతే లక్షలాది మంది మాల సోదరులతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం ఓయూలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశం ముగిసిపోయిందని వ్యాఖ్యానించడం తగదన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వలన 58 కులాలు గత అయిదు నెలలుగా ఎలాంటి అవకాశాలు లేకుండా నష్టపోతున్నారో ఆయనకు కనపడటం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వర్గీకరణ వలన మంద కృష్ణ మాదిగ, రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డిలు మాత్రమే సంతోషంగా ఉన్నారని మండిపడ్డారు.
మాల స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో దళితులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరో మంత్రి వివేక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా లక్ష్మణ్ ఎలాంటి భేషజాలకు పోకుండా వివేక్‌తో కలిసి దళితుల అభ్యున్నతికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ గౌరవాధ్యక్షుడు చెరుకు రాంచందర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్, అంసా ఓయూ అధ్యక్షుడు నామ సైదులు, జేఏసీ నాయకులు మాస శేఖర్, అంజిబాబు, కొప్పుల అర్జున్, నర్సింగ్, సాగర్, సునీల్, మోహన్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.