హైదరాబాద్ : నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి(Heavy rain) నగరం తడిసి ముద్దయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మ్యాన్‌హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. భారీ వర్షానికి ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాంనగర్లో(Ramnagar) ఓ ద్విచక్ర వాహనదారుడు(Bike rider) వరదలో(Flood) కొట్టుకుపోయాడు. వరదలో కొట్టుకుపోయిన మరో కూలి మృతి చెందాడు. కాగా, నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఎల్బీ స్టేడియం(LB Stadium) ప్రహరీ గోడ కూలిపోయింది. బషీర్ బాగ్ సీసీఎస్ పాత కార్యాలయానికి అనుకోని ఉన్న గోడ కూలడంతో అక్కడే పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. గోడ కూలే సమయంలో ఎవరు లేకపోవడం పెను ప్రమాదం తప్పింది.
మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు. కాగా, పంజాగుట్టలోని అపార్టుమెంట్ సుఖ్ నివాస్ అపార్టుమెంటు వద్ద పిడుగుపడింది (Lightning). షెడ్డుపై పిడుగు పడి కారు ధ్వంసమయింది. దీంతోపాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు.