ఎల్బీనగర్, నవంబర్ 8 : ఎల్బీనగర్ అసెంబ్లీ బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్, బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఇద్దరూ 420లేనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన పలు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… మధుయాష్కీ కనల్టెన్సీ ద్వారా తప్పుడు డాక్యుమెంట్లతో విద్యార్థులను అమెరికాకు పంపిన బాగోతం బయటపడి స్పష్టంగా పోలీస్‌స్టేషన్‌లో 420 కేసు నమోదైందన్నారు. ఇది నా ఆరోపణ కాదని, గోనే ప్రకాశ్ రావు చేసిన ఆరోపణ అని అన్నారు. నిజామాబాద్‌లో ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకుని ఇవ్వకుండా కొట్టిన కేసు ఉందన్నారు. అలాగే సామ రంగారెడ్డి పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ప్రాపర్టీ ఫోర్జరీ కేసులో 420 కేసు నమోదైందన్నారు.
ఈ నాయకులు రేపు శాసనసభ్యులైతే ప్రజలకు ఏమి మేలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేసే పరిస్థితి లేక మధుయాష్కీ గౌడ్ ఎల్బీనగర్కు వచ్చాడని విమర్శించారు. తాను స్థానికుడిని కాదని అవాకులు, చెవాకులు పేలుతున్నారని… 1986లోనే అక్బర్‌బాగ్ కార్పొరేటర్‌గా గెలిచానని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. మలక్‌పేట నియోజకవర్గంలోని అక్బర్‌బాగ్ డివిజన్ నుంచి రెండు మార్లు కార్పొరేటర్‌గా, ఒకసారి హుడా చైర్మన్‌గా, రెండు మార్లు ఎమ్మెల్యేగా, మరో వారు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశానని తెలిపారు. తానేంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసనని పేర్కొన్నారు.