పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
మన్సూరాబాద్, మార్చి 16: ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.103కోట్లతో జరుగుతున్న ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ పనులను రాబోయే వానకాలం లోపు పూర్తి చేయించేలా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చొరవ చూపాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. నాగోల్ బండ్లగూడ చెరువు వద్ద ఎస్ఎన్డీపీ ప్రాజెక్టులో భాగంగా రూ.49కోట్లతో చేపట్టిన వరదనీటి కాలువ పనులకు, ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులో రూ.18.07 కోట్లతో నూతనంగా నిర్మించిన అండర్‌పాస్ రోడ్డును, బైరామల్గౌడ్ చౌరస్తాలో రూ.28.64 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను బుధవారం మంత్రి కేటీఆర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్ చేపట్టే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇక నుంచి వరదనీటి నాలాల పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు వాక్ చేసి పర్యవేక్షించాలని సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే సుమారు రూ.2,500 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఎల్బీనగర్ నియోజవర్గంలో రూ.672కోట్లతో ఫైఓవర్లు, అండర్‌పాస్ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. మంచినీటి కోసమే రూ.313.26 కోట్లు వెచ్చించామని.. ఎల్బీనగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు వడివడిగా జరుగుతున్నాయని తెలిపారు. ఎల్బీనగర్ వాసులకు సంతోషకరమైన వార్త తెలుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అందరికీ వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో వెయ్యి పడకల తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) మంజూరు అయ్యిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి టిమ్స్ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఎల్బీనగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు స్థానిక బీజేపీ కార్పొరేటర్లు సహకరించాలని అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడి కేంద్రం నుంచి నిధులు తెప్పించాలని కోరారు.
అభివృద్ధిలో ఎల్బీనగర్ ముందంజ
– ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తూ ఎల్బీనగర్ నియోజకవర్గం ముందు ఉన్నదని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గంలో వరదనీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ కింద రూ.103కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ పనులను మే నెల చివరి లోపు పూర్తి చేస్తామని తెలిపారు. వరదనీటి కాలువల పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక బస్సు టెర్మినల్‌ను నిర్మించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఎస్ఎన్డీపీ చీఫ్ ఇంజినీర్ కిషన్, జోనల్ కమిషనర్ పంకజ, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, చింతల అరుణ, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, చెరుకు సంగీత, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, జీవీ సాగర్‌రెడ్డి, ముద్దగౌని లక్ష్మీప్రసన్న గౌడ్, రమావత్ పద్మానాయక్, భవానీ ప్రవీణ్‌కుమార్, వజీర్ ప్రకాశ్‌గౌడ్, వివిధ డివజన్ల అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, తూర్పాటి చిరంజీవి, చింతల రవికుమార్, నాయకులు పోచబోయిన జగదీశ్‌యాదవ్, తూర్పాటి కృష్ణ, జక్కిడి రఘువీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.