ఎల్బీనగర్, నవంబర్ 25 : ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి, పాస్‌పోర్టు, వీసాల కుంభకోణంలో ఉన్న మరో దొంగ మధుయాష్కీతో కలిసి నాపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉన్నదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎల్బీనగర్లో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ఇన్చార్జితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో వరదల సమయంలో కన్పించని ఎంపీ రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం మాత్రం వర్షంలో చేస్తూ తనపై అసత్య అరోపణలు చేశారన్నారు. 36 సంవత్సరాల నుంచి చేస్తున్న మార్నింగ్ వాక్‌పై మధుయాస్కీ అవాకులు, చెవాకులు పేలడం, దానికి మద్దతుగా వచ్చిన పెద్ద దొంగ రేవంత్‌రెడ్డిలు మూసీ నదిలో నన్నేం ముంచుతారు గానీ, వారిని హయత్‌నగర్ దాటాక ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో ముంచేస్తామని అన్నారు.
రాజకీయాల్లో సంస్కారంతో మాట్లాడాలని, సంస్కార హీనంగా మాట్లాడితే గట్టిగా బుద్ది చెబుతామన్నారు. ప్రజల సమస్యలను పరిష్కారం చేసేందుకు మార్నింగ్ వాక్ చేస్తున్న పవిత్ర కార్యక్రమంపై వ్యంగ్యంగా మాట్లాడిన నిజామాబాద్ నుంచి పారిపోయి వచ్చిన దొంగ మధుయాష్కీకి తగిన బుద్ది చెబుతామన్నారు. నిజామాబాద్‌లో మధుయాష్కీ మీద వచ్చిన ఆరోపణలు నేను చేసినవి కాదని, వీసాల కుంభకోణం, పాస్‌పోర్టు కుంభకోణంతో పాటుగా అమ్మయిలను విదేశాలకు ఎగుమతి చేస్తాడని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆరోపణలు చేశాడన్నారు. హయత్‌నగర్ తన స్వస్థలం అంటున్న మధుయాష్కీకి ఇప్పటికైనా ఈ ప్రాంతంపై ప్రేమ వచ్చింది మంచిదే కానీ అనవసర వ్యాఖ్యలు చేస్తే తొక్కి తోలు తీస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు తాను ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని, వారిపై ఉన్న కేసుల విషయాన్నే చెప్పానన్నారు. మధుయాష్కీ, సామ రంగారెడ్డిలపై వారు ఇచ్చిన అఫిడవిట్లోనే కేసుల వివరాలను పొందు పర్చారని, దానినే ప్రస్తావించానని తెలిపారు. మరోసారి తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఖబర్దార్ అంటూ సుధీర్‌రెడ్డి హెచ్చరించారు.
రేవంత్ మాటలు పనికిరానివి : ముద్దగౌని
ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం తెలంగాణ ప్రభుత్వ హయంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి సభలో ఏదో ఒక పనికిరాని విషయం మాట్లాడిపోతారని అందరికీ తెలుసు అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అన్ని కులాలు, మతాల వారు పనిచేసే నాయకుడిని గెలిపించాలని కోరుతున్నారని, పనిచేసే సుధీర్‌రెడ్డికే ఓటు వేస్తారన్నారు. ఎల్బీనగర్లో అభివృద్ధి చేశామంటే సుధీర్‌రెడ్డి, తాను, తమ మాజీ కార్పొరేటర్లు చేశారని అన్నారు. సామరంగారెడ్డి, మధుయాష్కీ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ నాయకుడు కుంట్లూరు వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ మధుయాష్కీ గౌడ్ పది సంవత్సరాలు నిజామాబాద్‌లో ఉన్నా అక్కడ ఎలాంటి పనులు చేయలేదు కాబట్టీ, అక్కడ పోటీ చేసేందుకు అవకాశం లేక ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారన్నారు. నియోజకవర్గం ప్రజలు ఎప్పుడు మార్పు కోరుతారో తెలుసుకోవాలని, ఎమ్మెల్యే అందుబాటులో లేకపోతే, అభివృద్ధి చేయకపోతే దూరం అవుతాయని, ఏ పార్టీ వారు వచ్చినా పనులు చేసి పెట్టే సుధీర్‌రెడ్డి ఉండగా ఇక్కడ ఎలామార్పు కోరుతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ముద్దగౌని లక్ష్మీప్రసన్న, చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్, రమావత్ పద్మానాయక్, కొప్పుల విఠల్‌రెడ్డి, జీవీ సాగర్‌రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, ఉదయ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.