LRS | సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ) ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం గందరగోళంగా మారింది. ఓవైపు దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించాలని నోటీసులు వస్తూంటే.. మరోవైపు ఇప్పటికీ మొదట దశ ప్రక్రియ కూడా పూర్తి కాని దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమ ప్లాట్లను క్రమబద్ధీకరించాలని ఐదారేళ్ల కిందటే నామా మాత్రపు ఫీజులను చెల్లించినా… ఇప్పటివరకు మొదటి దశ ప్రక్రియ కూడా పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. జీపీ లే అవుట్లు, అనధికారిక వెంచర్ల పరిధిలో ప్లాట్లను క్రమబద్ధీకరించాలనే లక్ష్యంతో జారీ చేసిన ఎల్ఆర్ఎస్ ప్రయోజనాలు నీరుగారిపోతున్నాయి.
ఏళ్లు గడుస్తున్నా దరఖాస్తులను అధికారులు పరిశీలించకపోవడంతో స్కీం ఫలితం లేకుండా పోతుంది. ఎల్ఆర్ఎస్ స్కీంను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆదాయ వనరులుగానే భావించడంతో ఏళ్లుగా మొదట దశలో జరగాల్సిన పరిశీలన కూడా జరగడం లేదు. దీంతో ఒక్క హెచ్ఎండీఏ పరిధిలోనే 75వేలకు పైగా మొదటిదశ(ఎల్1)లో ఉన్నాయి. ముందుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించకుండా కేవలం ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో ఎల్ఆర్ఎస్ పథకం వచ్చినా తమ దరఖాస్తులకు మోక్షం రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.
ముందుకు కదలని పరిశీలన…
2020లో వచ్చిన నోటీఫికేషన్ ప్రకారం ఎల్ఆర్ఎస్ కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయి. రిజిస్టేష్రన్ చేసుకునే క్రమంలోనే సింగిల్ ప్లాట్ వారీగా రూ.1000, వెంచర్ వారీగా రూ.10వేలు చెల్లించి నమోదు చేసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 3.75 లక్షల దరఖాస్తులలో 15 నుంచి20 వేల దరఖాస్తులు తిరస్కరించారు. మిగిలిన దరఖాస్తుల్లో 70నుంచి 80వేల లోపు దరఖాస్తులకు మాత్రమే ఫీజులు చెల్లిస్తే క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఉంది. వాటికి మాత్రమే ఫీజులు చెల్లించాలని సమాచారం. అయితే మిగిలిన 2లక్షల దరఖాస్తుల్లో మెజార్టీ అప్లికేషన్లు మొదటి దశ పరిశీలన కూడా పూర్తి కాలేదు.
ఇక ఎల్2, ఎల్3 పూర్తి అయితే గానీ ఫీజులు చెల్లించే అవకాశం ఉండదు. కానీ ఎల్1 దశలో రెవెన్యూ, ఇరిగేషన్తోపాటు, హెచ్ఎండీఏ అధికారులు సంబంధిత దరఖాస్తులను పరిశీలించిన తర్వాత క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సి ఉంటుంది. కానీ ఏళ్లు గడుస్తున్నా.. ఫీజులు చెల్లించిన దరఖాస్తులు మొదటి దశను దాటకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాము చెల్లించిన దరఖాస్తు ఫీజులను పరిగణనలోకి తీసుకుని, పరిశీలన పూర్తి చేస్తే ఫీజులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు. అయితే ఇటీవల కొన్ని దరఖాస్తులకు ఫీజులు చెల్లించాలని సమాచారం చేరవేస్తోంది. సమగ్ర పరిశీలన చేయకుండా ఫీజులు చెల్లించడం ఎందుకని ఫీజు ఇంటిమేషన్ సమాచారం వచ్చినా దరఖాస్తుదారులు స్పష్టమైన విధివిధానాల కోసం ఎదురుచూస్తున్నారు.