మేడ్చల్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి పథకానికి ప్రభుత్వం మంగళం పాడినట్లే కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ఈ యేడాది జనవరిలో ప్రారంభించి అమలు చేస్తున్నప్పటికీ.. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఇప్పటివరకు ఇంటి నిర్మాణాలకు గానీ, నూతన ఇండ్లు నిర్మించి ఇవ్వడం గురించి కానీ ఎలాంటి పనులు ముందుకు సాగలేదు.
ఇందిరమ్మ ఇంటి పథకం కోసం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో సుమారు 6 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారిక సమాచారం. ప్రతి నియోజకవర్గానికీ మొదటి దశలో 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే జిల్లాలోని ఒక్క మేడ్చల్ నియోజకవర్గానికి మాత్రమే 1,819 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి.
ఇందులో గ్రౌండింగ్ వరకు వెయ్యి ఇండ్లు కాగా మిగతా 819 మంది లబ్ధిదారులు ఇప్పటివరకు ఇంటి నిర్మాణాలు చేపట్టలేదు. అయితే మిగిలిన నియోజకవర్గాల్లో ఈ పథకం ద్వారా వచ్చే సాయం కోసం దరఖాస్తు చేసినవారికి నిరాశే మిగిలింది. తమకు ఇండ్ల పథకానికి సంబంధించి ఆర్థికసాయం ఎప్పుడు ఇస్తారని వారు అధికారులను పలుమార్లు అడిగినా.. సరైన సమాధానం కరువైంది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకాన్ని ఇక్కడ కూడా వెంటనే అమలు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.