సిటీ బ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : సకల హంగులతో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన విశ్వనగరం ప్లాస్టిక్ భూతం గుప్పిట్లో చికుకుపోతున్నది. కంఫర్ట్ జీవనానికి అలవాటు పడుతున్న నగర వాసులు ప్లాస్టిక్‌ను శరీరంలో భాగం చేసుకుంటున్నారు. సౌలభ్యం కోసం ప్లాస్టిక్‌పై అతిగా ఆధారపడుతూ వ్యర్థాలతో సహజీవనం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో చెత్త నిర్వహణ, కాలుష్య నియంత్రణ గాలికొదిలేయడంతో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా వన్‌టైం యూసేజ్ ప్లాస్టిక్ జలవనరుల్లో పేరుకుపోయి చెరువులు, కుంటలు కాలుష్యంతో నిండుతున్నాయి. నగరంలో విడుదలయ్యే వ్యర్థాల్లో దాదాపు 15 శాతం ప్లాస్టిక్ ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది.
ప్లాస్టిక్ అతివాడకం వల్ల నగర వాసుల శరీరాలు నానో ప్లాస్టిక్ కర్మాగారాలుగా మారుతున్నాయి. తాగునీటి బాటిళ్లు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వస్తువులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వాటి నుంచి పాలీకార్బోనేట్స్, బిస్ ఫినాల్-ఏ, యాంటిమోనీ వంటివి శరీరంలోకి ప్రవేశించి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి.పాలిథిలిన్, పాలీప్రొపైలిన్ వంటివి మానవ కణజాలాలను దాటి శరీర వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఈ నానో ప్లాస్టిక్ అణువులు మనం తీసుకున్న ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
ఆహారం జీర్ణమై రక్తంలో కలవడంతో అవయవాల్లోకి చేరుతాయి. ఇలా జరగడం వల్ల అవయవాల పనితీరులో హెచ్చు తగ్గులు ఏర్పడుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నానో ప్లాస్టిక్లు పిల్లల ఎదుగుదలను నియంత్రిస్తాయని ఐఐటీఆర్, సీడీఎస్ సీఓ, ఎన్ టీహెచ్ వంటి పరిశోధనలు పలు పలు అధ్యయనాల్లో వెల్లడించాయి. నగరంలో జీవించే వారి శవ పరీక్షల్లో మెదడు, కాలేయం, మూత్రపిండాల్లో నానో ప్లాస్టిక్ కనిపించడం మరింత ఆందోళనకు గురిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నానోప్లాస్టిక్ పరిమాణం మెదడులో సగటున 171 నానోమీటర్ల వరకూ ఉండడం పరిశోధకులను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది.
నగరంలో గాలి కాలుష్యంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యం పెరిగిపోతున్నా కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కట్టడిలో జీహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైంది. కనీస తనిఖీలు కూడా నిర్వహించకపోవడంతో ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. నగరంలోని ప్రతి ఇంట్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ సంచులు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ నీటిలో చేరడం ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి