సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను బకాయి ఒకేసారి చెల్లించి 90 శాతం రాయితీ పొందాలని, వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)ను సద్వినియోగం చేసుకోవాలన్న జీహెచ్ఎంసీ పిలుపునకు బకాయిదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఈ నెల 7న ఓటీఎస్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరులో ముగుస్తుండటం, నిర్దేశిత లక్ష్యం రూ.2100 కోట్లకు చేరాలంటే ఓటీఎస్‌తో సాధ్యమని అధికారులు అంచనా వేశారు.
ఐతే ఓటీఎస్‌ను బకాయిదారులందరూ సద్వినియోగం చేసుకుంటారని, తద్వారా రోజుకు రూ.20కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు భావించారు. ఈ మేరకు డీసీలు, బిల్ కలెక్టర్లు, కింది స్థాయి అధికారులు ఐదు లక్షలకు పైబడి ఉన్న బకాయిదారులపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. అయినప్పటికీ గడిచిన రెండు రోజులు రూ.5 నుంచి 6 కోట్లు మాత్రమే వసూలు అవుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీఎస్‌పై ఐటీ విభాగం విస్తృత ప్రచార లేమితో ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా మంగళవారం నాటి వరకు 12.60 లక్షల మంది నుంచి రూ. 1566 కోట్ల ఆదాయమే సమకూరింది.