Metro Parking | మెట్రోస్టేషన్లలో పెయిడ్ పార్కింగ్‌పై ఎల్అండ్టీ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 25 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్లో వాహనాల పార్కింగ్‌కు ఫీజును వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మియాపూర్ మెట్రోస్టేషన్లో పార్కింగ్‌కు ఫీజులు వసూలు చేయనున్నట్లు చెప్పింది. ఎల్అండ్టీ బుధవారం పైలట్ రన్‌గా నాగోల్ మెట్రోస్టేషన్లో పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేసింది. అయితే, పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాల కోసమే పెయిడ్ పార్కింగ్‌ను అమలులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోస్టేషన్లలో పార్కింగ్ ఫీజుల బోర్డులను ప్రదర్శించింది.
అయితే, ఎల్అండ్టీ నిర్ణయంపై ప్రయాణికుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ భూముల్లో పార్కింగ్‌కు ఎందుకు వసూలు చేస్తున్నారని పలువురు ప్రయాణికులు ప్రశ్నించారు. టికెట్ చార్జీల పెంపు, పార్కింగ్ ఫీజుల వసూలుకు వ్యతిరేకంగా నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులు నిరసన తెలిపారు. టికెట్ల పెంపును వెనక్కి తీసుకొని.. ఫ్రీ పార్కింగ్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మరో వైపు ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ కొనసాగగా.. దాన్ని ఎత్తివేస్తున్నట్లు ఎల్అండ్టీ ప్రకటించింది. ఇప్పటికే మిగతా స్టేషన్ల పరిధిలో హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ పెయిర్ పార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం 40 స్టేషన్ల పరిధిలో పార్కింగ్ సదుపాయం ఉన్నది.