కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 7: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను విరమించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. శనివారం కూకట్‌పల్లిలో మాట్లాడుతూ.. ఓ శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వీరపల్లి శంకర్… వెలమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పాలనలో కొన్ని సామాజిక వర్గాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలు చేసిన వారిపై కాంగ్రెస్ పార్టీ కానీ, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ చర్యలు తీసుకోవడం లేదన్నారు.
స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే ఓ సామాజిక వర్గం నేతలను బుల్డోజర్స్తో తొక్కిస్తానని, నల్లగొండలో రెడ్డి సామాజిక వర్గంపై కొందరు నేతలు, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్డు తీర్పు వస్తే… మాలలతో మాదిగలను తిట్డించడం కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? కాంగ్రెస్ పార్టీ వైఖరా? అనేది ప్రకటించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన పోరాటం వల్లే… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయం మర్చిపోవద్దన్నారు.
తాను కూకట్‌పల్లిలో అన్ని సామాజిక వర్గాలు, మతాలు, ప్రాంతాల వారు అదరించడం వల్లే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అందరినీ గౌరవించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెలమ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యాఖ్యపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే శంకర్ బేషరతుగా మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేకుంటే లక్షల మందితో ఉద్యమాలు చేయాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలపై శాసనసభ స్పీకర్, డీజీపీ, ఎన్నికల కమిషనర్, గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.