కేపీహెచ్‌బీకాలనీ, జూలై 22 : హౌసింగ్‌బోర్డ్ భూములను ప్రభుత్వం అమ్ముకోవడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కేపీహెచ్‌బీకాలనీ 3వ రోడ్‌లోని వరసిద్ధి వినాయకస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పక్కన హౌసింగ్‌బోర్డ్ అధికారులు అమ్మకానికి యత్నిస్తున్న ఖాళీ స్థలాన్ని ఆయన పరిశీలించారు.
అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ళ బీఆర్‌ఎస్‌పాలనలో హౌసింగ్ బోర్డ్ స్థలంలోనుంచి గజం స్థలం కూడా అమ్మలేదని తెలిపారు. కాంగ్రస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.5 వేల కోట్ల విలువ చేసే హౌసింగ్‌బోర్డ్ భూములను అమ్మడానికి పూనుకుందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వేలాది కోట్ల విలువైన హౌసింగ్‌బోర్డ్ భూములను ప్రజల కోసం పార్క్‌లుగా అభివృద్ధి చేశామని తెలిపారు. అదేవిధంగా 24 ఎకరాల హౌసింగ్‌బోర్డ్ స్థలాన్ని కాపాడినట్లు మాధవరం పేర్కొన్నారు.
హౌసింగ్‌బోర్డ్ స్థలాల వేలంపాట పేరిట ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. 100 ఫీట్ల రోడ్డును చూపెట్టి వేలంలో స్థలాన్ని విక్రయించగా తీరా క్షేత్రస్థాయిలోకి వెళ్లి చూడగా 42 ఫీట్లు మాత్రమే ఉంటోందని.. శతో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.హౌసింగ్బోర్డ్అధికారులు స్థలాన్ని విక్రయించక ముందు 15 పేజీలలో కమ్యూనిటీ అవసరాల కోసం వదిలిన స్థలాలను చూపెట్టాలని డిమాండ్ చేశారు.
దేవాలయం, చర్చికి స్థలాలను కేటాయించాలి
కేపీహెచ్‌బీకాలనీ 1, 2 ఫేజ్లలోని వరసిద్ధి వినాయక దేవాలయం ప్రాగణంలోని సుమారు 200 గజాల హౌసింగ్ బోర్డ్ స్థలాన్ని దేవాలయం కోసం కేటాచయించాలని మరో చోట క్రైస్తవ ప్రార్థన మందిరం (చర్చి) కోసం స్థలం కేటాయించాలని రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్‌కు ఎమ్మెల్యే కృష్ణారావు లేఖ రాశారు. వరసిద్ధి వినాయక దేవాలయ ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని వినాయక, అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించినప్పుడు స్థలం ఉపయోగపడుతుందన్నారు.
భక్తుల కోరిక మేకు ఈ స్థలాన్ని కేటాయించాలని కోరారు. అదేవిధంగా కాలనీలో గల క్రైస్తవుల కోసం చర్చికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేపీహెచ్‌బీకాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, బాలాజజీనగర్ కార్పొరేటర్ పగడాల శిరీష బాబురావు, రాగిడి లక్ష్మారెడ్డి, కో ఆర్డినేటర్ సతీశ్అరోర, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.