కేపీహెచ్‌బీ కాలనీ : రాష్ట్రంలో తప్పుడు వాగ్ధానాలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆడపడుచులకు తలం బంగారం ఎప్పుడిస్తరో చెప్పాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. శుక్రవారం కూకట్పల్లి మండల కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 161 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కృష్ణారావు, ఎంఆర్వో స్వామి, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, జూపల్లి సత్యనారాయణ, సబిహా గౌసుద్దీన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు పడే కష్టాలను చూసిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆడబిడ్డ పెండ్లికి కానుకగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో లక్షా నూట పదహారు రూపాయల చొప్పున ఆర్థికసాయం చేశారని అన్నారు. దాంతో పేదింటిలో పెద్దన్నలా కేసీఆర్‌ను ఆదరించారని చెప్పారు. నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని విమర్శించారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో లబ్ధిదారులకు లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని ఆశపెట్టి ఓట్లను దండుకున్నారని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా తులం బంగారం ఇచ్చింది లేదని మండిపడ్డారు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్ధానాలను సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.