దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అడవి బిడ్డల కల నెరవేరింది. శుక్రవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల 50వేల ఎకరాల్లో లక్షా 51వేల మంది రైతులకు మహిళల పేరుమీదనే పట్టాలు ఇస్తున్నట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లోనే పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని చెప్పారు. ఇక నుంచి గిరిజనులే పోడు భూములకు యజమానులని, సర్వ హక్కులు వారికే ఉంటాయన్నారు.
ధరణిలో మీ పేరుతో భూమి రికార్డు అవుతుందని, ఇతర రైతులకు మాదిరిగానే రైతుబంధు, రైతు భీమా, తదితర అన్ని స్కీంలు వర్తిస్తాయని తెలిపారు. గతంలో గిరిజనులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మంత్రి హరీశ్‌రావు గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారు.
నిజామాబాద్ జిల్లాలో 4229 మంది రైతులకు 8611 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 5015 మంది రైతులకు 11,347 ఎకరాల భూములకు సంబంధించిన పోడు పట్టాల పంపిణీని శుక్రవారం బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
వికారాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అర్హులైన 436 మంది గిరిజనులకు 552 ఎకరాలకు సంబంధించిన పోడు భూముల పట్టాలను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.