ఇది సామాన్య విజయం కాదు.. చరిత్రలో నిలిచిపోయే పోరాటం. యుద్ధంలో సైనికుడిలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకూ శిరస్సు వంచి సలాం చేస్తున్నా. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతి గులాబీ సైనికుడి కండ్లల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్నిచ్చింది. పల్లెపోరులో అరాచక కాంగ్రెస్‌ను, రేవంత్‌రెడ్డిని మట్టికరిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరుగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది.’
‘సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పక్షానికి ఏకపక్షంగా ఉంటాయి.కానీ, ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకొని తిరిగినా, మంత్రులను మోహరించినా సగం సీట్లు సాధించడానికే తంటాలు పడ్డారు. అధికార పార్టీ ఇంత తకువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలువడం చరిత్రలో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన జంగ్ సైరన్.’
– కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు. ఈ ఎన్నికల తీర్పు తర్వాత రానున్న ప్రతి ఎన్నికలో కూడా హస్తం పార్టీ మరింత పతనం కాక తప్పదని హెచ్చరించారు. రెండేండ్లుగా ప్రజలను అన్ని అంశాల్లో మోసం చేసిన అధికార పార్టీకి పల్లెజనం తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రాష్ట్రంలోని ప్రతి ఒకరినీ మోసం చేసిందని, అందుకే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షం గురించి అడ్డగోలు మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు.. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడేది బీఆర్ఎస్సేనని ఎన్నికల ద్వారా మరోసారి ప్రజలు నిరూపించారని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, బలప్రయోగాన్ని, హింసను ఎదురొని భారీగా పంచాయతీలను బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన అభ్యర్థులకు కట్టబెట్టారని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
‘రేవంత్‌రెడ్డి పాపం పండింది. గ్యారెంటీల పేరుతో మోసం, రైతుబంధు ఎగ్గొట్టడం, యూరియా కోసం లైన్లలో నిల్చోబెట్టడం, పింఛన్ల పెంపుపై దగా చేయడం ప్రజలకు ఆగ్రహం తెప్పింది. అందుకే పంచాయతీ ఎన్నికల్లో తిరుగుబాటు వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చుపెట్టి, రాజకీయ హింసను తీసుకొచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజల పక్షాన కొట్లాడేది బీఆర్ఎస్సేనని ఎన్నికల ద్వారా మరోసారి ప్రజలు నిరూపించారు.’- కేటీఆర్
కార్యకర్తలు, ఓటర్లకు కేటీఆర్ కృతజ్ఞతలు
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలను తట్టుకొని పోరాడి, బీఆర్ఎస్ వెంట నిలిచిన ప్రతి ఒక కార్యకర్తకు, ఓటరుకు ఈ సందర్భంగా కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఫలితాలతో సీఎం రేవంత్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన దాడులకు తెగబడుతున్న ప్రతి ఒకరికీ భవిష్యత్తులో గట్టి సమాధానం చెప్తామని కేటీఆర్ హెచ్చరించారు.