KTR | జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా.. బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. హైదరాబాద్ షేక్‌పేట డివిజన్‌కు చెందిన సీనియర్ నాయకుడు చెర్క మహేశ్.. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని.. రాష్ట్రంలో రెండేళ్లుగా అధికారంలో ఉన్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తదని అన్నారు. రెండేళ్లలో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖర్చు పెడతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఓటుకు రూ.10 వేలు కూడా ఇస్తామంటారని తెలిపారు. బీజేపీ తెలంగాణకు పనికిరాని పార్టీ అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని అన్నారు.
హైదరాబాద్‌లో అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ మళ్లీ రావాల్సిందే అని కేటీఆర్ అన్నారు. అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాల్సిందే అన్నారు. అప్పుడే ఎన్నికల హామీల అమలులో చేసిన మోసంతో ప్రజలు కోపంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటుందన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు రూ.4వేల పెన్షన్ వస్తుందని.. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని స్పష్టం చేశారు. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. ప్రజలను.. ఎంత మోసం చేసినా ప్రజలు ఏమీ అనరనే ధీమాలోకి వెళ్లిపోతారని తెలిపారు.
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని విమర్శించారు. ఈ రెండేళ్లుగా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిందని మండిపడ్డారు. ఒక్క ఇల్లు కట్టలేదు.. ఒక్క ఇటుక పెట్టలేదు.. కానీ 2.30లక్షల అప్పు మాత్రం చేసిందన్నారు. గరీబోళ్ల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి, హైదరాబాద్‌లో ఇళ్లు కూలగొట్టిస్తున్నాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని సూచించారు. కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదవాళ్ళ ఇండ్లపైన బుల్డోజర్లను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నదని మండిపడ్డారు. అన్నీ తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి మోసం చేశాడని ఆరోపించారు. పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని తెలుసన్నారు. ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేస్తుందని కూడా తెలిసి మరీ బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేశాడని ఆరోపించారు. అజారుద్దీన్‌కు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్సీ కూడా ఆయనకు రాదని తెలుసు, కానీ ఆయనను కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ముస్లింలకు ఇస్తామని చెప్పిన స్మశానం విషయంలో కూడా మోసం చేశారని తెలిపారు.
తెలిసి మరీ ప్రజలను మోసం చేయడమే రేవంత్ రెడ్డి నైజమని అన్నారు. ఆయన నిజాయితీగా చెబుతూ మరీ మోసం చేస్తున్నాడని తెలిపారు. ఆయన గతంలోనే ‘మోసం చేసే వాళ్లనే ప్రజలు నమ్ముతారు’ అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండన్నారు. రెండు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క పని చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రెండు సంవత్సరాలు కేవలం కేసీఆర్ నామం జపం చేసి కాలం గడిపేసిండన్నారు.