అబిడ్స్, అక్టోబర్ 16: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గౌలిగూడలోని మహాత్మాగాంధీ బస్‌స్టాండ్ లోపల, వెలుపల గల రెండు ఆటో స్టాండ్లను తొలగించాలని రంగారెడ్డి రీజియన్ రీజినల్ మేనేజర్ ఆటో డైవర్లపై ఒత్తిడి తీసుకు రావడంతో వారు గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు ఆనంద్‌కుమార్ గౌడ్‌ను కలిసి సమస్యను వివరించారు.
స్పందించిన ఆనంద్‌కుమార్ గౌడ్ గురువారం ఆటో డ్రైవర్లతో కలిసి బీఆర్ఎస్ భవన్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలిసి సమస్యను వివరించారు. స్పందించిన కేటీఆర్ రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీతో మాట్లాడి ఆటో స్టాండ్లను తొలగించకుండా చూసి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అనేక పథకాలను తీసుకువచ్చారన్నారు. అభివృద్ధిలో నగరాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చిన తరువాత మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ పథకం తీసుకు రావడంతో తమకు గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నామన్నారు.