సిటీబ్యూరో/అమీర్‌పేట, నవంబర్ 8(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం ఎర్రగడ్డ డివిజన్లో నిర్వహించిన కేటీఆర్ రోడ్‌షో సూపర్‌హిట్ అయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్‌తో కలిసి ఏజీ కాలనీ నుంచి జనప్రియ టవర్స్ వరకు ఈ ప్రచార యాత్ర సాగింది. అప్పటికే డివిజన్ నలుమూలల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పాదయాత్రలు, బైక్‌ర్యాలీల ద్వారా సభాస్థలాలకు చేరుకోవడం ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
నెత్తిన బతుకమ్మలతో తరలివచ్చి ఆడబిడ్డలు ఆడిపాడి సందడి చేయడంతో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంగా కేటీఆర్‌పై శ్రేణులు, స్థానికులు, అభిమానులు పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. దీంతో రోడ్షోదారులన్నీ గులాబీరంగు సంతరించుకున్నాయి. దాదాపు గంట పాటు సాగిన రోడ్‌షోలో కేటీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోసపూరిత కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పి.. మాగంటి సునీతా గోపీనాథ్‌కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కండ్లకు కట్టినట్టు వివరిస్తూ
ప్రత్యేక స్క్రీన్లలో కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎండగట్టారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ వివరించారు. నిరుపేదలపై హైడ్రా భూతం విరుచుకుపడుతున్నదని, ఇళ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా తయారైందని మండిపడ్డారు. పేదల కోసమేనా హైడ్రా? పెద్దలకు వర్తించవా? అని కేటీఆర్ ప్రశ్నించినప్పుడు ప్రజలు సైతం హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
బీఆర్ఎస్ హయాంలో సాధించిన ప్రగతి, రెండేళ్ల కాంగ్రెస్ అరాచక పాలనపై ప్రజలకు పూసగుచ్చినట్టు వివరిస్తూ ఆకట్టుకున్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పి ఓటు అడగాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క చాన్స్ ఇస్తేనే నాశనం చేశారని, మరోసారి జూబ్లీహిల్స్‌లో ఓటు వేస్తే సర్వనాశనం చేస్తారని సూచించారు. ఇలా రామన్న ప్రసంగం ప్రజలను ఆలోచింపజేయగా అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కేటీఆర్ రోడ్ షోలకు వస్తున్న స్పందనతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతున్నది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సలీం, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, నేతలు కోనేరు కోనప్ప, భూపాల్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, పి.విష్ణువర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు ఆవుల రవీందర్‌రెడ్డి, ముద్దం నర్సింహాయాదవ్, సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి సతీశ్‌రావు పాల్గొన్నారు.