 
                                                            సిటీబ్యూరో, అక్టోబరు 30 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్‌ల వారీగా బాధ్యతలు తీసుకుని ఇంటింటి పాదయాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి శుక్రవారం నుంచి రోడ్ షోలు నిర్వహించనున్నారు.
తొలి రోజు షేక్‌పేట డివిజన్లో సాయంత్రం 5 గంటల నుంచి రోడ్ షో ప్రారంభం కానున్నది. తొలుత టౌలీచౌకి, షేక్‌పేట నాలా, ఓయూ కాలనీ, హనుమాన్ మందిరం, సమతా కాలనీ, ఆదిత్య నగర్ మీదుగా రోడ్ షో జరిగి చివరకు టౌలీచౌకీలో ముగియనున్నది. కాగా షేక్‌పేట చౌరస్తాలో ఏర్పాట్లను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు గురువారం పరిశీలించారు.
 
                            