రసూల్పురలో 4 గంటలు, షాహ్బాజ్గూడలో 2 గంటలు, బోడుప్పల్లో 2 గంటలు, జీడిమెట్ల కొంపల్లి ఏరియాలో 2 గంటలు, మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో గంటకోసారి, బోరబండలో గంటకోసారి, సికింద్రాబాద్‌లో గంట గంటకు.. ఇలా కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు.. ఇదంతా అప్రకటిత కరెంట్ కోతల పరిస్థితి. రంజాన్, ఉగాది, శ్రీరామనవమి.. కావేవీ కరెంట్ కోతలకు అనర్హం అన్నట్లు పండుగల సమయాల్లోనూ కరెంట్‌కోతలు ప్రజలను చికాకు తెప్పించాయి. ప్రతీ ఏరియాలో ఏదో ఒక సమయంలో కరెంట్ తీసేశారంటూ అధికారులకు, సిబ్బందికి ఫోన్లు వచ్చాయి. అయినా పట్టింపు లేకుండానే ఉన్నారు. అసలు అప్రకటిత కరెంట్ కోతలకు కారణమేంటా అని విద్యుత్ సిబ్బందిని అడిగితే ఓవర్‌లోడ్ కారణంగా ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయని చెప్పారు. కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లపైన లోడ్ పడి కాలిపోతున్నాయన్నారు. బయట ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం, ఈదురుగాలులతో కూడిన వర్షం.. ఇలా వాతావరణ పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియని పరిస్థితుల్లో కరెంట్ కోతలు కూడా నగరవాసులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. -సిటీబ్యూరో
సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ):చిన్న చినుకు పడితే చాలు నగరంలో చీకట్లు అలుముకుంటున్నాయి. గాలివానకు తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. చిన్న వర్షం పడితే చాలు కరెంట్ పోవడం,మరమ్మత్తులకు ఎక్కువ సమయం పట్టడంతో నగరవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు రాత్రిళ్లు జాగారమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత ఐదురోజులుగా అడపాదడపా హైదరాబాద్‌లో సాయంత్రం వేళ కురుస్తున్న వర్షాలకు చాలాచోట్ల విద్యుత్ సరఫరాల్లో అంతరాయాలేర్పడడం, చెట్లు విరిగిపడడం, కొమ్మలు పడిపోవడం లాంటివి జరిగాయి.
కొన్ని ప్రాంతాల్లో అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది సరిపడా లేకపోయినా.. కొన్నిచోట్ల ఉన్నప్పటికీ స్థంభాలు ఎక్కేందుకు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఫీడర్ కిలోమీటర్ల పొడవు ఉండడంతో సమస్య ఎక్కడ తలెత్తిందో గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని సంస్థ సీఎండీ జితేష్ వీ పాటిల్ సమీక్షించినప్పుడు సరఫరా పునరుద్దరించకుండానే కొందరు ఇంజనీర్లు పూర్తయినట్లు చెప్పడంతో సీఎండీ సీరియస్ అయ్యారు.
నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు..!
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న విద్యుత్ ఉన్నతాదికారులపై బదిలీ వేటు పడింది. అకాల వర్షం, ఈదురుగాలులతో ఈనెల 24న సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. ఈ విషయంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. మరమ్మత్తులు చేపట్టి సకాలంలో సరఫరా పురుద్దరించకపోవడం, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయికి రాకపోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ మెట్రోజోన్ చీఫ్ ఇంజనీర్ వీ.ప్రభాకర్, బంజారాహిల్స్ ఎస్ఈ ఎ.నర్సింహులును కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఇందులో మరో అంశం కూడా మెట్రోజోన్ సీఈపై చర్యలకు కారణముంది.
పాత సీఎండీ మౌఖిక ఆదేశాలంటూ ఈనెల 20న మెట్రోజోన్ పరిధిలో ఇచ్చిన జీవో వివాదాస్పదమైంది. ఈ విషయంపై ప్రస్తుత సీఎండీ జితేష్ సీఈ ప్రభాకర్‌పై సీరియస్ అవడంతో ఈనెల 23న ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఆర్డర్లు వస్తాయంటూ పేర్కొంటూ ప్రభాకర్ మరో ఉత్తర్వు జారీ చేశారు. ఈ రెండింటిపై నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితం కావడం, సీఈ స్థాయిలో సరిగా పనిచేయకపోవడంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై క్షేత్రస్థాయి పనితీరును పరిశీలించకపోవడంపై సీఎండీ జితేశ్ వేటువేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో హెచ్ఆర్డీ విభాగానికి చెందిన చీఫ్ ఇంజనీర్ కే.భాస్కర్ తన పనితీరు మార్చుకోకపోవడంతో ఆయనను సీజీఆర్ఎఫ్ -1కు బదిలీ చేశారు. బదిలీ అయిన స్థానాల్లో తాత్కాలికంగా అధికారులకు అదనపు బాద్యతలు
అప్పగించారు.