సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ పనులపై నిర్లక్ష్యం వహిస్తోందని, గడిచిన 8 నెలలుగా సరైన పర్యవేక్షణ లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని, వెంటనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఎస్ఆర్డీపీ మూడో దశను ప్రారంభించాలని, దీనికి సంబంధించిన ప్రణాళికలకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా లభించిందని పేర్కొన్నారు. మూసీకి ఇరువైపులా ఎక్స్‌ప్రెస్ వే, కేబీఆర్ పార్కు కింద టన్నెల్స్, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి పనులు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) పేరుతో మంచి కార్యక్రమాన్ని తీసుకుందని కేటీఆర్ వివరించారు.
ఎస్ఆర్డీపీలో 42 కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయాలని సంకల్పించి, 36 ప్రాజెక్టులను పూర్తి చేసిందని తెలిపారు. మిగిలిన ప్రాజెక్టులను ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. నగరంలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు అభివృద్ధికి దోహదపడే ఈ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
18