ప్రతీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి భరోసాగా నిలిచారని కేటీఆర్ అన్నారు. హైడ్రా పేరుతో ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హైదరాబాద్‌లో తిట్టుకోని మనిషిలేడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో 2014 వరకు ఒక కొత్త దవాఖానా కట్టలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నగరంలో 4 అధునాతన టిమ్స్ ఆస్పత్రులు కట్టించామన్నారు. అలాగే రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కిందన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసేవారు కాదు.. మహిళల మెడలో పుస్తెలతాడులు తెంపుకొనిపోయే దండుపాళ్యం బ్యాచ్‌లా కాంగ్రెస్ నేతలు తయారయ్యారని కేటీఆర్ మండిపడ్డారు. మల్కాజిగిరిలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు.
మేడ్చల్, మల్కాజిగిరి, (నమస్తే తెలంగాణ) జూన్ 19: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగ ద్రోహిగా మిగిలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్లుగా ఖాళీల భర్తీ విషయంలో కాలయాపన చేస్తోందని ఆయన మండి పడ్డారు. శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గం మచ్చబొల్లారం డివిజన్లోని మెమొంటోస్ వెడ్డింగ్ కన్వెన్షన్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన, నియోకవర్గ ఇన్చార్జి నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం, సర్ అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి అధికార మదంతో బెదిరింపులు, గూండాగిరికి దిగుతున్నారని.. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. వారి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా నిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలపై వీధి పోరాటలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా కీలకమని, ప్రతి బూత్‌లో బీఎల్ఏలు ఇంటింటికీ వెళ్లి 18ఏళ్లు నిండిన యువతీయువకులను ఓటరుగా నమోదు చేయించాలన్నారు.

కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మల్కాజిగిరిలోని 480 బూత్‌లు ఉన్నాయని, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా కీలకమని, అధికార పార్టీలు ప్రతిపక్షాల ఓట్లు తొలగించే కుట్రలు చేస్తున్నాయని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్‌రెడ్డి, సబిత అనిల్‌కిషోర్, సునీతరాము యాదవ్, బీఆర్ఎస్ నాయకులు వెంకన్న, పరాశురాం, డోలి రమేష్, ప్రశాంత్‌రెడ్డి, నార్ల సురేష్, భాస్కర్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్, శ్రీనివాసులు, శోభన్, రహమత్‌ఖాన్, మహేష్, సరిత, హరిత, వీణ తదితరులు పాల్గొన్నారు.

మల్కాజిగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బలరాంనగర్ డివిజన్ బీఆర్ఎస్ యువ నాయకుడు గొట్ల వెంకటేశ్ యాదవ్, గొట్ల శివసాయియాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా బ్యానర్లు, కటౌట్లతో డివిజన్ మొత్తం గులాబీమయంగా తయారయ్యింది.
కేసీఆర్ ఆశీర్వదించి పంపిస్తే మల్కాజిగిరి ప్రజలు 50వేల మెజార్టీ ఇచ్చి గెలిపించారని, వారికి రుణపడి ఉంటామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామన్నారు. అధికార పార్టీ నాపై వ్యక్తిగతంగా కక్షసాధిస్తున్నా.. పోరాటం చేస్తున్నానని.. ఏ ఒక్క కార్యకర్తను పోగోట్టుకోలేదని తెలిపారు. ఏ కష్టం వచ్చిన, సమస్యలు వచ్చిన అండగా నిలుస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన కృషిని తెలియజేశారు. – మర్రి రాజశేఖర్‌రెడ్డి