KTR | పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదలు సుఖంగా జీవించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తమ హయాంలో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. పేదలు తెలియక ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుంటే జీవో 58, 59 కింద పట్టాలు ఇచ్చామని అన్నారు. రెండున్నర లక్షల మంది పేదలకు పట్టాలు ఇచ్చిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. హైదరాబాద్ కూకటపల్లి నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అదే కాంగ్రెస్ రెండున్నరేళ్లలో హైదరాబాద్లో ఒక్క ఇంటినైనా కట్టారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు.
ఇందిరమ్మ రాజ్యం అంటూ శనివారం, ఆదివారం నాడు ఇండ్లు కూలగొట్టారని కేటీఆర్ మండిపడ్డారు. కూకట్పల్లిలో బుచ్చమ్మ ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారని.. ఇల్లు పోతుందనే భయంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టలేదు.. కానీ కూలగొట్టిన ఇండ్లు వేలల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇండ్లు కూలగొట్టే ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కట్టినట్లు చూపిస్తే నేను శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటాను
– కేటీఆర్ pic.twitter.com/BJmDz4FH1k
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2026
గుంపు మేస్త్రీ అంటే ఇళ్లను కట్టాలి కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇళ్లను కూలగొడుతున్నాడని మండిపడ్డారు. దేశం మొత్తం కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకున్నారని.. తెలంగాణలో మాత్రం ఆ దరిద్రాన్ని తెచ్చుకున్నామని అన్నారు. దొంగ గ్యారంటీ కార్డులతో కొంప ముంచారని మండిపడ్డారు. కేసీఆర్ కల్యాణ లక్ష్మీకి రూ.లక్ష ఇస్తే.. కాంగ్రెస్ వాళ్లు అదనంగా తులం బంగారం ఇస్తామని అన్నారని గుర్తుచేశారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ఒక్క రూపాయి అయినా పెన్షన్ పెంచిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయ్యిందని.. ఒక్కరికైనా రూ.2500 వచ్చాయా అని అడిగారు. కోడలుకు రూ.2500 ఇస్తామన్నాడని.. అత్తకు 4వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాడని తెలిపారు. ఇలా ప్రతి వర్గానికి శఠగోపం పెట్టారని అన్నారు.
కేసీఆర్ ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికీ మంచినీటి గోస తీర్చారని కేటీఆర్ తెలిపారు. ఏడాదిన్నరలోనే కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారని పేర్కొన్నారు. 2028లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో 24 గంటలు మంచినీళ్లు ఇస్తామని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలకు కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. 24 గంటలు మంచినీళ్లు ఇచ్చేది కూడా కేసీఆరే అని స్పష్టం చేశారు.
కేసీఆర్ హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని కేటీఆర్ తెలిపారు. టీ హబ్ పేరిట డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. నిజాం కట్టిన ఆస్పత్రులు తప్ప కాంగ్రెస్ ఒక్క ఆస్పత్రి కట్టలేదని అన్నారు. కేసీఆర్ హయాంలో నగరానికి నాలుగు వైపులా 4వేల పడకలతో టిమ్స్ పేరుతో 4 ఆస్పత్రుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. కేసీఆర్ నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి కత్తెర పట్టుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. మనం కట్టిన ఫ్లైఓవర్లు, ఆస్పత్రులకు రిబ్బన్ కటింగ్లు చేస్తున్నాడని అన్నారు.