సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రక ఘట్టం కేసీఆర్ దీక్ష అని, ఈ నెల 29న నగరవ్యాప్తంగా దీక్షా దివస్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మంగళవారం హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సమావేశం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్‌ను మూడు లేదా నాలుగు ముక్కలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే కుట్రలో బీజేపీకి కూడా భాగం ఉందని విమర్శించారు. నిత్యం జనంలో ఉండి ప్రజల కష్టాల్లో తోడు ఉండే వారందరికీ అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ చెప్పారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాగా ఈ నెల 29న ఉదయం 9 గంటలకు నిమ్స్ హాస్పిటల్లో 2వేల మందికి పండ్ల పంపిణీ, సాయంత్రం నాలుగు గంటలకు బసవ తారకం క్యాన్సర్ దవాఖాన నుంచి తెలంగాణ భవన్‌కు భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్లో జరిగే దీక్షా దివస్‌కు హైదరాబాద్‌లోని వివిధ నియోజకవర్గాల నుంచి 10వేల మంది వరకు హాజరు అవుతారని నేతలు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, విప్లవ్, నేతలు ఎంఎన్ శ్రీనివాస రావు, తలసాని సాయి కిరణ్, మన్నె గోవర్ధన్, కిశోర్ గౌడ్, ఆర్వీ మహేందర్, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.