సంక్రాంతి వేడుకల్లో భాగంగా సోమవారం నగరవ్యాప్తంగా భోగి పండగను ఘనంగా జరుపుకొన్నారు. పిల్లలు, పెద్దలు, ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు తమ ఇండ్ల ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. మరోవైపు భక్తులు ఆలయాలకు వెళ్లి..ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నివాసంలో జరిగిన భోగి వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవ్వగా, బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ వైభవంగా ప్రారంభమైంది. తొలిరోజు విభిన్న ఆకృతులతో కూడిన రంగురంగుల భారీ పతంగులు ఆకట్టుకుంటే..పసందైన స్వీట్లు నోరూరించాయి.
చైనా మాంజా విక్రయదారులపై 107 కేసులు
సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): నిషేధిత చైనా మాంజాలపై నగర టాస్క్‌ఫోర్స్ విభాగం, స్థానిక పోలీసులతో కలిసి నాలుగు నెలల్లో 107 కేసులు నమోదు చేసిందని టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుదీంద్ర తెలిపారు. ఈ మేరకు సోమవారం టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రావు విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. సింథటిక్ నైలాన్, గ్లాస్ కోటింగ్‌తో తయారు చేసిన పతంగుల దారాలతో మనుషులతో పాటు జంతువులు, పక్షుల ప్రాణాలకు హాని జరుగుతుందని, ఈ నేపథ్యంలో చైనా మాంజాలపై నిషేధం ఉందన్నారు. అయినా కూడా కొందరు వ్యాపారులు చైనా మాంజాలను తెచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే గత అక్టోబర్ నెల నుంచి జనవరి 13వ తేదీ వరకు నగరంలోని ఏడు జోన్లలో స్థానిక పోలీసులతో కలిసి 107 కేసులు నమోదు చేసి 148 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. వీరి వద్ద నుంచి రూ. 90 లక్షల విలువైన 7334 చైనా మాంజా బబ్బిన్స్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చైనా మాంజాలను ఎవరూ వాడకూడదంటూ పోలీసులు సూచిస్తున్నారు.
వేడుకలు.. ప్రయాణాలు
సిటీబ్యూరో: దేశంలో అక్కడక్కడ హెచ్ఎంపీవీ వైరస్‌కు సంబంధించిన కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చాలా మంది ప్రజలు నగరాల నుంచి వారి సొంత గ్రామాలకు పయనమవుతుంటారు. అంతే కాకుండా ఈ సీజన్లో పలు రకాల జాతరలు, వేడుకలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జనం ఒక్కచోట గుమ్మిగూడటం వల్ల అంటువ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ అని, సాధారణ జలుబు, దగ్గు వంటి ఫ్లూ సంబంధిత వైరస్లు కూడా ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశముంటుందని వైద్యులు చెబుతున్నారు. మరో వైపు దేశంలో హెచ్ఎంపీవీ అలజడి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు పాటించడం శ్రేయస్కరమంటున్నారు వైద్యనిపుణులు.
అప్రమత్తంగా ఉండాలి
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వీరికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల సాధారణ జలుబు చేసినా త్వరగా తగ్గకపోవడమే కాకుండా సకాలంలో సరైన చికిత్స అందించకపోతే అది ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశాలుంటాయని చెబుతున్నారు వైద్యులు. చలికాలం కావడంతో సాధారణంగానే వైరస్ల ప్రభావం అధికంగా ఉంటుందని, వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై అవి ఇతరుల కంటే మరింత తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని, హెచ్ఎంపీవీ వంటి వైరస్లు ప్రమాదకరం కాకపోయినా వీరిపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదంటున్నారు నిపుణులు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. దూర ప్రయాణాలు చేసినప్పుడు, జనావాసాల మధ్య వెళ్లినప్పుడు సాధ్యమైనంత వరకు మాస్కులు ధరించడం ఉత్తమమని, చేతులకు శానిటైజర్ వాడటం వంటి నియమాలు పాటించడం శ్రేయస్కరమని యాదాద్రి-భువనగిరి జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు సూచించారు.