సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ వేడుకలు బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు, అలాగే జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ కళాకారులను కేటీఆర్ సన్మానించారు.
బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా సాగడంతో గ్రేటర్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ఆవిర్భావం నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్, రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని పరుగులు పెట్టించారంటూ బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుకున్నారు. దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో టాప్‌గా నిలిపి దేశంలోనే కేసీఆర్ చరిత్ర సృష్టించారని చర్చించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని, ప్రస్తుత పాలకులకు పాలనపై పట్టు లేక, రాష్ట్రం అధోగతి పాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని, అందరిని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు రాష్ర్టానికి గుదిబండగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ నేతృత్వంలో పనిచేశామని, రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం ప్రపంచంలో ఒక చరిత్రగా నిలిచిపోయిందని ప్రజలు ఆనాటి ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలందరిని ఏకం చేసి, రాష్ర్టాన్ని కేసీఆర్ ఒంటి చేత్తో సాధించారని అన్నారు. ఆయన లక్ష్యం బంగారు తెలంగాణ చేయడమేనని, అందులో భాగంగానే పదేండ్ల పాలన సాగిందంటూ అందరు చర్చించుకున్నారు. ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ పలు విషయాలపై మాట్లాడారు. రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ రాష్ర్టాన్ని ఎలా ముందుకు తీసికెళ్లారో ప్రజలందరు పదేండ్లపాటు చూశారని, నేడు కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి జరిగి, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలంటే కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.