Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో ఒక్కరోజు ముందే గణేశ్ నిమజ్జనం చేయాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీన మహాగణపతి నిమజ్జనం జరగాల్సి ఉంది. కానీ అదే రోజు చంద్ర గ్రహణం ఉండటంతో నిమజ్జనం ఎప్పుడు చేయాలనే దానిపై ఇటీవల సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో గణేశ్ ఉత్సవ కమిటీ ఒక క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 6వ తేదీనే శోభాయాత్ర నిర్వహించి, నిమజ్జనం పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పును భక్తులు గమనించాలని సూచించింది.
ఇదిలా ఉంటే ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో లక్షలాదిగా తరలివచ్చారు. మింట్ కాంపౌండ్, వార్డు ఆఫీసు, రైల్వే గేటు నుంచి ఏర్పాటు చేసిన క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.. ఖైరతాబాద్ చౌరస్తాలో క్యూలైన్ దాటి జనం క్యూకట్టారు. ట్రాపిక్జామ్లు కాకుండా ఉండేందుకు ఇప్పటికే పోలీసులు ప్రత్యేక రూట్ మ్యాప్ విడుదల చేశారు.