ఆర్కేపురం, జూన్ 2 : తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని పీఎస్వై ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటోళ్ల సబితాఇంద్రారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసి కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా పదేళ్లపాటు సమర్థవంతమైన పాలన అందించి రాష్ర్టాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ర్టాల సరసన నిలిపారని కొనియాడారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి వంటి అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, త్వరలో ప్రారంభమయ్యే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి మహేశ్వరం నియోజకవర్గం సత్తాను మరోసారి చాటాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.