సిటీబ్యూరో/బంజారాహిల్స్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ) : అభివృద్ధి ఒక్కటే సరిపోదు.. సంక్షేమం కూడా అందరికీ అందాలని నిత్యం తపించే నాయకుడు. ‘తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్’ సహకారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి, అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా ముందుకు పాలన సాగించిన మాగంటి గోపీనాథ్ జనాన్ని వదిలి…..స్వర్గానికేగినారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి.. ప్రజా ప్రయోజనాల కోసం పరితపించే వ్యక్తిగా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటారు మాగంటి గోపీనాథ్. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు మాగంటికి ఉంది. ప్రజలతో ప్రతి నిత్యం మమేకమై అనేక సమస్యలను పరిష్కరించి, మృధు స్వభావిగా మంచిపేరు తెచ్చుకున్నారు. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదర్శవంతమైన వ్యక్తిగా తనదైన ముద్ర వేసుకున్నారు.
రాజకీయాల్లో తనకంటూ ముద్ర
మాగంటి గోపీనాథ్ 1983లో దివంగత నేత నందమూరి తారక రామారావుపై అభిమానంతో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1992 వరకు తెలుగుదేశం అనుబంధ సంస్థ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 1987, 1988 సంవత్సరాల్లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు.
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్‌పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం 2018 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లోనే శాసనసభలో పీఈసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2022 జనవరి 26న బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
సినీ పరిశ్రమలోనూ ప్రత్యేక స్థానం
మాగంటి గోపీనాథ్ సీని రంగంలోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు. సినిమాలపై ప్రత్యేక ఆసక్తి కనబర్చే మాగంటి.. నిర్మాతగా పలు చిత్రాలను తీశారు. 1995లో పాతబస్తీ, రవన్న (2000), భద్రాద్రి రాముడు (2004), నా ైస్టెలే వేరు (2009)లో సినిమాలు తీసి సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
పూర్తిగా విభిన్నమైన శైలి
అధికారం కోసం పూటకో పార్టీ మార్చే నేతలున్న ప్రస్తుత రాజకీయ రంగంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ది పూర్తిగా విభిన్నమైన శైలి. నమ్మిన నేతను వదిలిపెట్టి స్వార్థం కోసం వేరే పార్టీలోకి వెళ్లడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదంటూ అనేకసార్లు తన సన్నిహితుల వద్ద కుండబద్దలు కొట్టేవారు. ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఆయన రాజకీయ రంగప్రవేశంతో 1983 నుంచి పార్టీలో అనేక పదవులు నిర్వహించారు.
తొలిసారిగా 2014లో జూబ్లీహిల్స్ టికెట్ దక్కడంతో అసెంబ్లీలో అడుగుపెట్టిన మాగంటి గోపీనాథ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల కారణంగా బీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. 32 ఏళ్ల పాటు ఒకే పార్టీలో పనిచేసిన తాను 2015లో పార్టీ మారడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే తాము ఫోకస్ చేయాలనుకుంటున్నామని, తెలంగాణలో పార్టీ భవిష్యత్ కష్టమేనని పెద్దలు స్పష్టమైన అభిప్రాయానికి రావడమేనని ఎమ్మెల్యే మాగంటి పలు సందర్భాల్లో చెప్పేవారు.
బీఆర్ఎస్లోకి రావడానికి ప్రధానమైన కారణం ఉద్యమ సారథి కేసీఆర్‌లోని మంచితనమే అని, తెలంగాణ వస్తే హైదరాబాద్‌లోని సీమాంధ్రుల పరిస్థితి ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమైన తరుణంలో కేసీఆర్ పాలన భరోసా కల్పించిందని, అందుకే తాను బీఆర్ఎస్లో చేరానని పలు సందర్భాల్లో మాగంటి గోపీనాథ్ చెప్పేవారు.
2023 డిసెంబర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత పార్టీ మారాలంటూ కాంగ్రెస్ నేతల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. తనను నమ్మి రెండుసార్లు టికెట్ ఇచ్చిన కేసీఆర్‌కు ఎట్టి పరిస్థితిలో ద్రోహం చేసే ప్రసక్తే లేదని మాగంటి స్పష్టం చేశారు. టికెట్ దక్కలేదని, కార్పొరేషన్ పదవులు దక్కలేదని, మంత్రి పదవి దక్కలేదని, పైరవీల కోసం పార్టీలు మారే నాయకులు ఉన్న ప్రస్తుత తరుణంలో 42 ఏండ్ల ప్రస్తానంలో ఒకే సారి పార్టీ మారిన మాగంటి గోపీనాథ్‌ది విలక్షణ శైలి అని ఆయన అభిమానులు, రాజకీయ పరిశీలకులు చెప్పుకుంటూ వచ్చారు.
అన్ని రంగాల్లోనూ స్నేహితులే
రాజకీయాల్లోనే కాకుండా సినీ, వ్యాపార రంగాల్లో మంచి స్నేహితులను కలిగి ఉన్న మాగంటి గోపీనాథ్‌ను రెండు తెలుగు రాష్ర్టాల్లో అపద్భాందుగా భావించే వారు ఉన్నారు. మాగంటి గోపీనాథ్..ప్రత్యేకంగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కష్టం అని ఎవరొచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి సమస్యలను పరిష్కరించడంలో దిట్ట. ఒకసారి మనసుకు నచ్చితే స్నేహాన్ని వదులుకోరు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎంతో మంది స్నేహితులున్నారు. రాజకీయ, వ్యాపార, సినీ, పారిశ్రామిక రంగాల్లో ప్రముఖులంతా ఆయనకు సుపరిచితులే.
కుటుంబ నేపథ్యం
మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యూటోరియల్స్ నుంచి ఇంటర్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ (బీఏ) పూర్తి చేశారు. ఆయనకు సునీతతో వివాహం జరిగింది. వారికి మాగంటి వాత్సల్యనాథ్ కుమారుడు, అక్షర నాగ, దిశిర అనే ఇద్దరు కుమార్తెలున్నారు. మాగంటి గోసీనాథ్ 1983లో రాజకీయాల్లోకి వచ్చారు.
అత్యంత బాధాకరం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.
– బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే
తీవ్రంగా కలిచివేసింది..
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి రాష్ర్టానికి తీరని లోటు. అనారోగ్యంతో ఆయన మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. మాగంటి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.
-మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే
నిస్వార్థంగా సేవలు
మాగంటి గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి.. పేద, అణగారిన, మైనారిటీ వర్గాల సంక్షేమానికి నిరంతరం శ్రమించారు. నిస్వార్థంగా సేవలు అందించి స్థానిక ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల మన్ననలను పొందారు. ఆయన కుటుంబసభ్యులు, అభిమానులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నా.
– పద్మారావుగౌడ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే
ఒకే సారి రాజకీయాల్లోకి వచ్చాం..
మాగంటి గోపీనాథ్ నాకు మంచి మిత్రుడు. ఇద్దరం ఒకే సారి రాజకీయాల్లోకి వచ్చాం. ఎదుటి వారి పట్ల మర్యాదపూర్వకంగా, స్నేహభావంతో మెలిగే గొప్ప వ్యక్తి. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమయ్యే మాగంటి గోపీనాథ్‌ని కోల్పోవడం అత్యంత బాధాకర విషయం.
– సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే
మాగంటి మృతి బాధాకరం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
– తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్ ఎమ్మెల్యే
క్రమశిక్షణకు కట్టుబడి..
పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి.. ప్రజా ప్రయోజనాల కోసం పరితపించే గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. 42 సంవత్సరాలుగా ఆయనతో స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నా. ప్రజల శ్రేయస్సు, బాగోగుల గురించి నిరంతరం కృషి చేసే వ్యక్తి. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రజలకు తీరని లోటు.
– మధుసూదనాచారి, ఎమ్మెల్సీ
మచ్చలేని నాయకుడు
పేద ప్రజల పాలిట సేవకుడు, మచ్చలేని నాయకుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. అంతటి మహనీయుడిని కోల్పోవడం చాలా బాధాకరం. జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో ధనవంతులతో పాటు నిరు పేదలుండే ఎన్నో బస్తీలు ఉన్నాయి. అలాంటి వారి కోసం నిరంతరం పరితపిస్తున్న ఆయనకు ప్రజలు మూడు సార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని ఆధిపత్యాన్ని కల్పించారు. అంతటి గొప్ప నాయకుడిని కోల్పోవడం ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే