వికారాబాద్, జూన్ 5, (నమస్తే తెలంగాణ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఖరీదైన వైద్య విద్యను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుది దశకు చేరిన అనుబంధ ఆసుపత్రి నిర్మాణానికి ఏడాదిపాటు నయాపైసా నిధులివ్వకపోవడంతో ఆసుపత్రి నిర్మాణం ఎక్కడిక్కడే నిలిచిపోయింది. జిల్లా ప్రజాప్రతినిధులపై ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ఏడాది తర్వాత ప్రభుత్వం నిధులను మంజూరు చేయడంతోపాటు పనులు పూర్తి చేశారు. అయితే 400 పడకల ఆసుపత్రిని ప్రారంభించి నెలరోజులు కావొస్తున్నప్పటికీ వైద్య సేవలు మాత్రం ఇంకా ప్రారంభం కాకపోవడం గమనార్హం.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహతోపాటు స్పీకర్ ప్రసాద్‌కుమార్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రిని ప్రారంభించినా.. వైద్య సేవలు ప్రారంభంకాకపోవడం గమనార్హం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏడాదిన్నరగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ విద్యార్థులకు సంబంధించి రెండో సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రాక్టీకల్ తరగతులను వికారాబాద్‌లోని సీహెచ్‌సీ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు.
అత్యవసర సేవలు పొందాలంటే..
ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినా, ఇతర అత్యవసర వైద్య సేవలు పొందాలంటే హైదరాబాద్‌లోని ఏదో ఒక ఆసుపత్రికి తీసుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్లే సరికి మార్గ మధ్యలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఈ దయనీయ పరిస్థితి త్వరలోనే పోతుందని అనుకున్న జిల్లా వాసులకు ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారింది. అయితే జిల్లా మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నిరంతరం అన్ని రకాల వైద్య సేవలు , అత్యాధునిక వైద్య చికిత్సలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
అదేవిధంగా ప్రస్తుతం 12 వైద్య సేవలు కొనసాగుతుండగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చినట్లయితే గ్రామీణ ప్రాంతంతో కూడుకొని ఉన్న జిల్లా ప్రజలకు 26 రకాల వైద్య సేవలు అందుతాయి. అంతేకాకుండా ఐసీయూ, ట్రామా కేంద్రాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు జిల్లాలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలన్నీ మ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారుతాయి.
సూపర్ స్పెషాలిటీ సేవలు ఎప్పుడో..?
జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనుబంధంగా నిర్మిస్తున్న 380 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితోపాటు 20 పడకల ఐసీయూ కలిపి మొత్తం 400 పడకల ఆసుపత్రి నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.30 కోట్లను విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో అనుబంధ ఆసుపత్రి భనవ నిర్మాణ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తయ్యాయి.
అయితే చిన్న చిన్న పనులు పెండింగ్‌లో ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరపాటు నిధుల కొరతతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశించిన జిల్లా ప్రజలకు ఆసుపత్రిని ప్రారంభించినప్పటికీ ఇంకా ఎదురుచూపులే మిగిలాయి.