Congress | సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కట్టిన ఇంటికి సున్నం వేసినట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. హైదరాబాద్ విశ్వనగరానికి మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన సర్కారు ఏడాదిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కీలకమైన ప్రాజెక్టును పట్టాలెక్కించిన దాఖలాలు మచ్చుకైన కనబడుతలేదు. పైపెచ్చు ప్రజాపాలన విజయోత్సవాల పేరిట గత ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించి మేమే చేసినట్లుగా గొప్పలు చెప్పుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు నగరంలోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వద్దనున్న హెచ్ఎండీఏ గ్రౌండ్ వేదికైంది. నేడు జలమండలి ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ ఫేజ్ -2లో 19 రిజర్వాయర్లు, ఆరు ఎస్టీపీలను సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు.
మురుగు శుద్ధి నగరంగా మార్చిన కేసీఆర్ ప్రభుత్వం
దేశంలోనే వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను నిలుపాలన్న గత కేసీఆర్ ప్రభుత్వం పూర్తి లక్ష్యం మరికొద్ది రోజుల్లో నెరవేరబోతున్నది. రోజూ ఉత్పన్నమయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయడానికి వీలుగా రూ. 3866.41 కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్డి సామర్థ్యంతో 27 కొత్త ఎస్టీపీలను చేపట్టి గత అక్టోబర్‌లో ఏడు చోట్ల ఎస్టీపీలు వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఆరు ప్రాంతాలు నాగోల్, ఫతేనగర్, మిరాలం, ఖాజాకుంట, మియాపూర్-పటేల్ చెరువు, సఫిల్‌గూడ ప్రాంతాల్లో చేపట్టిన ఎస్టీపీలు పనులు పూర్తి చేసుకుని ట్రయల్ రన్ వరకు తీసుకువచ్చారు. తుది మెరుగులు దిద్దిన ప్రభుత్వం ఈ ఆరు చోట్ల ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే నల్లచెరువు, పెద్ద చెరువు ఎస్టీపీలను ప్రారంభించి తమ ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్..తాజాగా ఆరు ఎస్టీపీలను మా ప్రభుత్వమే అందుబాటులోకి తెచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.
దక్షిణాసియాలోనే ఏకైక నగరంగా..
హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ధృడ సంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసీలో ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే 20కోట్ల లీటర్ల మురుగునీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో రూ.3866 వేల కోట్లతో 27 ఎస్టీపీలకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే మూడు నెలల్లోగా మిగిలిన ఎస్టీపీలను అందుబాటులోకి రావడం ద్వారా దక్షిణ ఆసియాలోనే వందకు వంద శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ నిలవనుంది. ఎస్టీపీల నిర్మాణంలో కేంద్రం ఒక్క పైసా ఇవ్వకుండా ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా చేపట్టింది.
నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం హెచ్ సిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.3,666.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. హెచ్ సిటీ ప్రాజెక్టు కింద రోడ్ల నిర్మాణ పనులు రూ.3,500కోట్లు, రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లు 12 నిర్మాణాలకు రూ. 16.50 కోట్లు, రూ. 150 కోట్లతో 283 చోట్ల సుందరీకరణ పనులను ప్రారంభించనున్నారు. వీటితో పాటు ప్రతి సర్కిల్లో శానిటేషన్ కార్మికులకు స్క్రీనింగ్, హెల్త్ క్యాంపులు, ప్రతి సర్కిల్లో 2కె రన్, కొన్ని సర్కిళ్లలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నారు.
రెయిన్ వాటర్ సంపుల డిజైన్లను మార్చండి
వరద నివారణ చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ లేక్‌వ్యూ గెస్ట్ హౌజ్ వద్ద నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంపు పనులను సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వరద నివారణ చర్యలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. రోడ్లపై వరద నీటిని మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించవచ్చని చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్నీ చోట్ల పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. రెయిన్ వాటర్ సంపుల డిజైన్ మార్చాలని సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ సంపులను నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడే19 రిజర్వాయర్లు ప్రారంభం..
శరవేగంగా విస్తరిస్తున్న నగరంలో ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా సమృద్ధిగా నీరందించేందుకు గత ప్రభుత్వం బాటలు వేసింది. ఔటర్ లోపల 193 గ్రామాలకు మెరుగైన నీటి సరఫరాకు గానూ రూ.750 కోట్లు ఖర్చు పెట్టి 164 రిజర్వాయర్లు, 1571 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి దాహార్తిని దూరం చేసింది. ఇదే సమయంలో ఔటర్ లోపల మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు గానూ రూ. 1200కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-2 పనులు చేపట్టింది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, పటాన్చెరు నియోజకవర్గాల్లో రెండు ప్యాకేజీలుగా విభజించి 73 రిజర్వాయర్ల పనులు చేపట్టి..దాదాపు ప్రాజెక్టును తుది దశకు చేర్చి ఎన్నికల ముందు 23 చోట్ల రిజర్వాయర్లను ప్రారంభించింది. నేడు 19 రిజర్వాయర్లను సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించి అందుబాటులోకి తేనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 25 లక్షల మందికి లబ్ధి జరగడంతో పాటు అదనంగా 1.50 లక్షల కొత్త నల్లా కనెక్షన్లు అందుబాటులోకి రానున్నాయి.
అందుబాటులోకి వచ్చే ఎస్టీపీలు..
ఎస్టీపీ ప్రాంతం : సామర్థ్యం (ఎంఎల్డీలలో)
ఖాజాకుంట : 20
సఫిల్‌గూడ : 5.5
మిరాలం : 41.5
మియాపూర్ పటేల్‌చెరువు : 7.0
ఫత్తేనగర్ : 133
నాగోల్ : 320
ఓఆర్ఆర్ ఫేజ్-2లో 19 రిజర్వాయర్లు