KCR | తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దామోదర్ మృతిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. ఇండియా టుడే జాతీయ న్యూస్ ఛానల్లో పని చేస్తున్న దామోదర్.. తొలినాటి నుంచీ తెలంగాణ ఉద్యమ వార్తల కవరేజ్‌లో చురుగ్గా పాల్గొనేవాడని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న దామోదర్ అకాల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వీడియో జర్నలిస్ట్ దామోదర్ అకాల మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దామోదర్ మరణవార్త తెలిసిన వెంటనే కేటీఆర్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దామోదర్ నాకు తెలిసిన మీడియా మిత్రుడని కేటీఆర్ పేర్కొన్నారు. దామోదర్ అస్వస్థతకు గురైన విషయం తెలియగానే కేటీఆర్ వెంటనే స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ఆరా తీసి, తక్షణమే మెరుగైన వైద్య సేవలు ఉండేలా చూడాలని పార్టీ నేతలను కోరారు.
కేటీఆర్ సూచనల మేరకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు ఆస్పత్రిలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. దామోదర్‌కు సీపీఆర్(CPR) చేయడం, ఇతర అత్యవసర వైద్య చికిత్సలు అందించడం వంటి అంశాలను దగ్గరుండి ఆసుపత్రి యాజమాన్యంతో సమన్వయం చేశారు. ప్రాణాలు కాపాడేందుకు పార్టీ నేతలు శాయశక్తులా కృషి చేసినప్పటికీ, ఫలితం దక్కలేదని ఆవేదన చెందారు. గాంధీ హాస్పిటల్‌కు వెళ్లి దామోదర్ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇలాంటి విషాద సమయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, క్రిశాంక్ ఉన్నారు.