హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ నెల 21న యూకేలో నిర్వహించనున్న బతుకమ్మ సంబురాల పోస్టర్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచమంతా విస్తరించడం సంతోషంగా ఉన్నదని చెప్పారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించడంతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయన్నారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచమంతా వ్యాపింపజేయడంలో బతుకమ్మది కీలకపాత్ర అని తెలిపారు. ఏటా వివిధ దేశాల్లో బతుకమ్మ సంబురాలను అగంరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలియజేశారు. బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే మహిళలకు ఉచితంగా చేనేత చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించిన భారత జాగృతి యూకే విభాగాన్ని అభినందించారు. కార్యక్రమంలో జాగృతి యూకే అధ్యక్షుడు బల్మురి సుమన్, టీఎస్ఫుడ్స్ చైర్మన్, భారత జాగృతి వైస్ ప్రెసిడెంట్ రాజీవ్‌సాగర్, భారత జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు