మణికొండ, సెప్టెంబర్ 29: బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గానికి రావాల్సిన ‘మెట్రో’ట్రైన్‌ను తప్పించారని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆరోపించారు. మూడు నియోజకవర్గాలకు ప్రయోజనం కలిగే మెట్రో ప్రాజెక్టుకు వెంటనే డీపీఆర్ సిద్ధం చేసి ఆమోదింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మైండ్‌స్పేస్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ వేసిన శిలాఫలకానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్ తీరుకు నిరసనగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే పోలీసులు కార్తీక్‌రెడ్డితోపాటు పలువురిని అరెస్టుచేసి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీ కత్తుపై పోలీసులు వారిని విడుదల చేశారు.
సీఎంది సింగిల్ పాయింట్ ఎజెండా..
కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన పరిపాలన సాగుతోందని మండిపడ్డారు. రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తానంటూ ప్రమాణం చేసి ఇప్పుడు ..సింగిల్ పాయింట్ ఎజెండాగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఏ నిర్ణయమైనా వాటికి ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు ఏర్పాటుకు 2023లో అప్పటి సీఎం కేసీఆర్ శంఖుస్థాపన చేశారని.. ఇప్పుడు అదే ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు క్యాన్సిల్ చేశారో ప్రజలకు తెలపాలన్నారు. అన్నీ బాగుండి ఈ ప్రాంతంలో మెట్రో వచ్చిఉంటే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల ప్రజలకు ఎంతగానో మేలు జరిగేదన్నారు. విచిత్రమేమిటంలే ఈ మూడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు పార్టీ మారిన తర్వాత ఈ ప్రాంతాల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్నారు.
మెట్రో వచ్చి ఉంటే మరింత అభివృద్ధి..
రాజేంద్రనగర్ నియోజకవర్గానికి మెట్రో రైలు వచ్చి ఉంటే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేదని అన్నారు. ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వ్యాపారాలు, అద్దెలు పెరిగి ఉండేవని కార్తీక్‌రెడ్డి అన్నారు. ఆస్తి విలువలు, భూముల ధరలు కూడా పెరిగేవని అన్నారు. రాజేంద్రనగర్‌కు మెట్రో రాకుండా చేయడం వెనుక సీఎం రేవంత్ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు. నియోజకవర్గంలో ఏం అభివృద్ధి పనులు చేపట్టారో స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముమ్మాటికీ భవిష్యత్‌లో రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అని.. అప్పుడు రాజేంద్రనగర్‌కు ఖచ్చితంగా మెట్రోను తీసుకువస్తామని కార్తీక్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఫ్యూచరే లేని దగ్గర…ఫ్యూచర్ సిటీ ఎందుకు?
ఫ్యూచరే కనిపించని ఫ్యూచరే సిటీ కోసం ఆలోచిస్తూ.. ప్రజెంట్ సిటీకి ఫ్యూచరే లేకుండా చేస్తున్న ప్రెజెంట్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కార్తీక్‌రెడ్డి అన్నారు. కోర్ సిటీ కోసం ఆలోచించకుండా.. ఫ్యూచరే లేని సిటీ కోసం ప్రజెంట్ సిటీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మా ప్రాంతానికి మెట్రో కావాలని శాంతియుతంగా మాజీ సీఎం కేసీఆర్ వేసిన శిలాఫలకం వద్ద క్షీరాభిషేకం చేసేందుకు వెళ్తే.. అకారణంగా పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇదీ ఆరంభం మాత్రమే.. భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు.
స్థానిక ఎమ్మెల్యేను నిలదీయాలి..
స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్.. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారో, చేరి ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని కార్తీక్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రాజేంద్రగనర్ ప్రాంతంలో మెట్రో ఎందుకు ఆగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను ప్రజలు నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. ప్రజలతో మమేకమై పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లి మెట్రోను సాధించి తీరుతామని దీమా వ్యక్తంచేశారు. అరెస్టు అయిన వారిలో నార్సింగి, బండ్లగూడ జాగీర్, మణికొండ మున్సిపాలిటీ అధ్యక్షులు కే విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు.. నాగరాజు, సీతారాం, అందె లక్ష్మణ్‌రావు, ముక్తార్పాష, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. అయితే వందలాది మంది నాయకులు, కార్యకర్తలు నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చి కార్తీక్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు.