HCU Lands | సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): అందరిది ఒకటే గొంతు.. పర్యావరణ పరిరక్షణకు అందరిది ఒకే బాట.. విషయం ఏదైనా ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని బట్టబయలు చేయడమే తమ లక్ష్యం అన్నట్లుగా అరుదైన జీవవైవిధ్యం నిండిన హెచ్‌సీయూ భూముల పరిరక్షణకు ఒకటిగా గళం విప్పారు. పర్యావరణంపై ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని కేంద్ర కమిటీ కళ్ల ముందర నిలిపారు. కంచ గచ్చిబౌలి భూములపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారు.. పర్యావరణంపై చేసిన దారుణాలను నివేదికలతో సహా వివరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిటీ సభ్యులను విద్యార్థులు కలవకుండా పోలీసులు అడ్డుకున్నా.. జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో విద్యార్థులు, వర్సిటీ జేఎసీ సభ్యులతో సమావేశమయ్యారు.
ఈ క్రమంలోనే భూముల కోసం ప్రభుత్వం చేసిన ఆకృత్యాలను నివేదిక రూపంలో పేర్కొన్నారు. విద్యార్థులతో దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో అరుదైన జీవావరణం విస్తరించిన కంచ గచ్చిబౌలి భూముల గురించి కమిటీ సభ్యులకు వివరించారు. యూనివర్సిటీ అధ్యాపక, విద్యార్థి సంఘం నుంచి ఐదుగురు సభ్యులు, మరో విద్యార్థి సంఘం నుంచి ఐదుగురు సభ్యులు కమిటీ సభ్యులను కలిశారు. సమావేశంలో వర్సిటీ భూముల విషయంలో జరిగిన విధ్వంసాన్ని, అటవీ సంపదను నిర్వీర్యం చేసే క్రమంలో ప్రభుత్వం అతిక్రమించిన చట్టాలు, వన్యప్రాణులతో చెలగాటం ఆడిన తీరును వివరించారు.
అరుదైన వృక్ష సంపద కలిసిన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు చేసిన కుట్రలను ముందరపెట్టారు. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ ప్రభుత్వం దృష్టి పెట్టలేదని, ఎంత సేపు జీవవైవిధ్యానికి నిలయమైన యూనివర్సిటీని చెరబట్టేందుకే ప్రభుత్వం యోచిస్తుందని, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడంతో వాస్తవాలను కోర్టుకు అందజేసి వర్సిటీ భూములలో కొలువై ఉన్న జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని విద్యార్థులు కోరారు.
ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర సాధికారిక కమిటీ బృందం ఒంటరిగానే యూనివర్సిటీలో పర్యటించింది. ఉదయం 10.30గంటలకు వర్సిటీ ప్రాంగణానికి చేరుకుని, చెట్లను నరికివేసిన ప్రాంతానికి వెనుక నుంచి చేరుకునేలా ప్రభుత్వం, పోలీసులు ఏర్పాట్లు చేశారు. అక్కడ గంట సేపు జరిపిన పరిశీలన తర్వాత.. నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్ఆర్డీ క్యాంపస్‌లో విద్యార్థి సంఘాలు, వర్సిటీ జేఏసీతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల విషయంలో ఎలా వ్యవహరించిందనే అంశాన్ని కమిటీ ముందర ఉంచారు.
పరిశోధన విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తయారు చేసిన ప్రత్యేక నివేదికలను కమిటీకి అందజేశారు. వర్సిటీ భూముల ఆక్రమణతో జీవం కోల్పోయిన వన్యప్రాణులు, వనసంపద విధ్వంసంతో దెబ్బతింటున్న జీవావరణం, పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించిన విద్యార్థులు, జేఏసీ సభ్యులపై పోలీసుల దౌర్జన్యం, అక్రమ కేసులతో విద్యార్థులపై జరిగిన వేధింపులను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
కేవలం భూముల కోసం అరుదైన వృక్షజాతులు, గుట్టలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలవరించేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. వర్సిటీ జేఏసీ, స్టూడెంట్ యూనియన్ నుంచి ఐదురుగు, ఏబీవీపీ నుంచి మరో ఐదుగురితో కూడిన రెండు బృందాలు కూడా గంటపాటు చర్చించాయి. ఈ క్రమంలో కమిటీ లేవనెత్తిన పలు అంశాలకు వివరించిన విద్యార్థులు.. ప్రభుత్వం చేసిన విధ్వంసం పర్యావరణానికి పెనుప్రమాదంగా మారిందని, దీంతో ఎంతో జీవవైవిధ్యం దెబ్బతిన్నట్లుగా పేర్కొన్నారు.
విద్యార్థుల ఆందోళనలు, పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేలా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, ఆ భూముల్లో అటవీ సంపద లేదని, వన్యప్రాణులే ఉండవని చెబుతూ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్న తీరును సాక్ష్యాధారాలతో సహా కమిటీకి అందజేశారు. గడిచిన 20 రోజుల కాలంగా వర్సిటీ భూముల్లో ఆవాసం కోల్పోయిన, మృత్యువాత పడిన జంతువుల చిత్రాలు, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అంటూ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలకు చెక్ పెట్టే విధంగా రూపొందించిన సమగ్రమైన సమాచారాన్ని నివేదిక రూపంలో అందజేశారు.
అటవీ భూములే కాదంటూ కాంగ్రెస్ చేస్తున్న వాదనలకు కొట్టిపారేస్తూ.. అటవీ భూముల నిర్ధారణకు అమలులో ఉన్న చట్టపరమైన, శాస్త్రీయ విధానాలతో చేసిన అధ్యయనాలను కూడా అందజేస్తామని కమిటీకి సూచించారు. ఈ క్రమంలో మరో దఫా జరిగే సమావేశంలో మరింత సమాచారం కూడా సేకరించి నివేదిక రూపంలో అందజేస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.
400 ఎకరాల విస్తీర్ణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన విధ్వంసాన్ని సెంట్రల్ కమిటీ ముందుకు తీసుకెళ్లాం. మార్చి 30 తర్వాత క్యాంపస్ ప్రాంగణంలో పర్యావరణం, వన్యప్రాణులపై చేసిన ఆక్రమణల తీరును కమిటీకి వివరించాం. అత్యున్నత న్యాయస్థానం నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని గౌరవిస్తూ.. క్షేత్రస్థాయిలో, వర్సిటీ ప్రాంగణంలో ఒకసారి కమిటీ సభ్యులు విద్యార్థులతో కలవాల్సిన అవసరం ఉంది, అనుమతించాలని కోరాం. విద్యార్థులు, జేఏసీతో మూకుమ్మడిగా వర్సిటీలో పర్యటించే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరాం. కేవలం భూముల లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కుట్రలను, విద్యార్థులపై పోలీసులు చేసిన దాడులను తమ విద్యార్థి సంఘం తరుపున నివేదిక రూపంలో అందజేశాం.
– బాలకృష్ణ, ఏబీవీపీ సెంట్రల్ కమిటీ
సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని 49 పేజీలతో రూపొందించిన నివేదికను సెంట్రల్ సాధికార కమిటీకి అందజేశాం. కమిటీ సభ్యులందరికీ అర్థమయ్యే విధంగా రూపొందించిన శాస్త్రీయ ఆధారాలు, జియోలొకేషన్, తేదీ, సమయంతో కూడిన వీడియోలు, ఫొటోలతో పర్యావరణంపై జరిగిన దాడిని వివరించాం. ఎంతో వృక్షసంపద, వన్యప్రాణులు జీవం కోల్పోతే ప్రభుత్వం మాత్రం ఏఐ ఆధారిత వీడియోలు, ఫొటోల పేరిట తప్పుదోవ పట్టిస్తోంది. యూనివర్సిటీలో విద్యార్థులను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. వీటన్నింటిని ప్రత్యేక నివేదిక రూపంలో అందజేయడంతో కమిటీ సభ్యుల నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది. అయితే సుప్రీంకోర్టుకు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుంది. మరోసారి కూడా విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని కమిటీ సభ్యులు కూడా తెలిపారు.
– ఉమేశ్, హెచ్‌సీయూ స్టూడెంట్ యూనియన్, ప్రెసిడెంట్