హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషితోనే రాష్ర్టానికి నాడు నీళ్లలో వాటా దక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్పష్టంచేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విప్ వివేకానందతో కలిసి ఆయన మాట్లాడారు. నూతన సంవత్సరాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బూతులు, అడ్డగోలు మాటలతో ప్రారంభించారని మండిపడ్డారు. సీఎంకు సబ్జెక్టు లేదని, బూతులే ఆయన ప్రసంగంలో ఉన్నాయని విరుచుకుపడ్డారు. ఆదిత్యానాథ్ సలహాలతోనే సీఎం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. న్యూరోలాజికల్ డిజార్డర్‌తో సీఎం బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గౌరవిస్తామని గురువారం ప్రెస్మీట్లో చెప్పి, అంతలోనే ఉరి తీయాలంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందు నుంచీ తెలంగాణపై రేవంత్‌రెడ్డికి వ్యతిరేకతే ఉన్నదని, కనీసం ఆయన సొంత జిల్లా పాలమూరు గడ్డకైనా న్యాయం చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. జూరాలలో ఈ రోజుకు కూడా క్రాప్ హాలిడే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో వాటర్ లిఫ్ట్ చేస్తున్నారని చెరువులు మత్తళ్లు దూకుతున్నాయని తెలిపారు. రాష్ర్టానికి అన్యాయం జరగవద్దంటే తెలంగాణ సోయి, నీళ్ల గురించి అవగాహన ఉన్న వారిని సలహాదారులుగా పెట్టుకోవాలని సూచించారు. ఆదిత్యానాథ్ సలహాలు తీసుకొని ఏపీకి నీళ్లను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. వెంటనే ఆయనను సలహాదారుగా తొలగించి రాష్ర్టానికి చెందిన వ్యక్తిని నియమించాలని డిమాండ్ చేశారు. నీళ్ల విషయంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌కు బనకచర్ల ఎక్కడుందో, దేవాదుల ఏ బేసిన్లో ఉందో కూడా తెలియదని చురకలంటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి ఎత్తలేదని దుయ్యబట్టారు.
అధికారమదంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద మండిపడ్డారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ ప్రతిపక్షనేతను సభలో కలువలేదన్నట్టుగా సీఎం రేవంత్ మొన్న కేసీఆర్‌ను కలిసిన విషయాన్ని ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక రెండేండ్లలో ఈ ప్రభుత్వానికి చేసిన అభివృద్ధిపై చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారని, అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గొంతుకగానే తాము అసెంబ్లీలో మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. శాసనసభను జీవో అవర్‌తో ప్రారంభించి కొత్త సంప్రదాయానికి కాంగ్రెస్ తెరలేపిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ తరఫున ఏ అంశంపైనైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.