హైదరాబాద్, ఆగస్టు 20, (నమస్తే తెలంగాణ): కరెంటు స్తంభాలకున్న కేబుళ్లను తొలగించొద్దని జస్టిస్ నగేశ్ భీమపాక మౌఖికంగా ఆదేశించారు. కరెంటు స్తంభాలకున్న వైర్లను తొలగింపు అంశంపై ప్రభుత్వం, జీహెచ్ ఎంసీ, తమ వాదనలతో కూడిన కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేశారు. కరెంటు స్తంభాలకున్న కేబుళ్లను తొలగించొద్దని రామంతాపూర్ లో విద్యుదాఘాతంతో ఐదుగరు మరణించిన ఘటన తరువాత సరార్ ఆదేశాలతో కేబుళ్ల కట్ చేయడాన్ని సవాలు చేస్తూ భారతి ఎయిర్టెల్ బుధవారం అత్యవసరం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
సీనియర్ న్యాయవాది రవి వాదిస్తూ, అనుమతులు పొందిన తరువాతే కరెంటు స్తంభాల నుంచి కేబుళ్లను తీసుకోవడం జరిగిందని, ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఒకో స్తంభానికి చార్జి చేస్తూ రూ. 21 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. నోటీసు జారీ చేయకుండా కేబుళ్ల తొలగింపు చట్ట వ్యతిరేకమన్నారు. ఒకసారిగా ప్రభుత్వ చర్య కారణంగా వైద్యులు, అడ్వోకేట్లు, ఎన్సీఎల్టీ, విద్యార్థులు, ఉద్యోగులు ప్రజలకు ఇంటర్నెట్ లేకుండాపోయిందన్నారు. ఇంటర్నెట్ లేకపోవడంతో వ్యవస్థ స్తంభించిపోయిందన్నారు. ప్రతివాదుల కౌంటర్ దాఖలు చేశాక ఈ అంశంపై ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. శుక్రవారం జరిగే విచారణలో తేల్చుతామని, అప్పటి వరకు ఉన్న కేబుళ్లను తొలగించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది.