హైదరాబాద్, జనవరి 21 నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో సింబయాసిస్ యూనివర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకే రోజు 40 కుక్కలను చంపిన సంఘటనపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారణ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. వీధి కుక్కల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు విచారణ చేస్తున్నందున ఈ పిల్ ను అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచన చేసింది. తమ ముందున్న వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రస్తుతం కుక్కలకు సంబంధించిన పిటీషన్లను సుప్రీం కోర్టు విచారిస్తున్నందున ఈ పిల్ ను అక్కడికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
నలభై కుక్కలను సామూహికంగా చంపిన పంచాయతీ సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైదరాబాద్ కు చెందిన న్యాయవాది వి రిషిహాస్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు కాకుండా కుక్కలు చంపినట్టుగా ఆధారాలు ఏమి ఉన్నాయని పిటిషనర్‌ను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు విచారణ చేస్తున్నందున తాము ఏ విధమైన ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది.