సిటీబ్యూరో, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు. సాధారణంగా ప్రచారంలో భాగంగా తమ వద్దకు నేతలు వచ్చి ఓట్లుడిగినప్పుడు మా ఓటు మీకే అని చెబుతుంటారు. కానీ జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారానికి వస్తున్న జాతీయ పార్టీల నేతలకు తమ ఓటు ఎవరికనేది కుండబద్ధలు కొట్టినట్టు ముఖం మీదే చెప్పేస్తూ ఝలక్ ఇస్తున్నారు. ఇప్పుడిదే కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బీజేపీ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సమయంలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
అమ్మా మీ ఓటు బీజేపీకి వేయాలంటూ ప్రచారం మొదలుపెట్టిన మహిళా కార్యకర్తను ఉద్దేశించి ‘మా ఓటు ఖచ్చితంగా బీఆర్ఎస్కే’ అంటూ షాక్ ఇచ్చారు. ‘కేసీఆర్ పాలనలోనే మాకు డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చింది. ఉండేందుకు గూడు దొరికింది. చేతినిండా పని దొరికింది’ అంటూ ఆ ఓటరు చెప్పిన సమాధానం రెండు పార్టీలకు చెంపపెట్టులా మారింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నగరంలో జరిగిన విధ్వంసం, అభివృద్ధికి ఆస్కారం లేని ప్రాంతాలను చూసి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రేవంత్రెడ్డి, కేంద్రంలోని బీజేపీతో చేసుకున్న లోపాయికారి ఒప్పందం కూడా బీఆర్ఎస్ నేతలతో పాటు, స్థానిక ఓటర్లను ఆలోచనలో పడేస్తున్నదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.