బంజారాహిల్స్,మార్చి 17: బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు ప్రవేశించిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56లోని ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ప్రవేశించిన ఆగంతకుడు గంటపాటు ఇంట్లోనే రెక్కీ నిర్వహించిన విషయాన్ని గురించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఇంటి వెనకాల కిటికీ గ్రిల్ తొలగించి లోనికి వచ్చిన ఆగంతకుడు సీసీ కెమెరాల లైన్‌ను కట్ చేయడాన్ని చూస్తుంటే గతంలో ఇంట్లో పనిచేసిన వ్యక్తి కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాలోని ఫుటేజీతో పాటు ఆ సమయంలో సెల్‌ఫోన్ టవర్ లొకేషన్‌ను విశ్లేషిస్తున్నారు. ఎంపీ ఇంటి ముందు రోడ్డుతో పాటు వెనకాల నుంచి రోడ్డు మీదకు వచ్చే దారులపై సీసీ కెమెరా ఫుటేజీని సేకరిస్తున్నారు. ముఖానికి మాస్కులు వేసుకోవడం, చేతులకు గ్లౌజులు, కాళ్లకు షూస్ వేసుకుని రావడాన్ని గమనిస్తే అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. దొంగతనం కోసం వచ్చి అలికిడి అయిన తర్వాత పారిపోయి ఉంటాడా అనే కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది.
ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు ప్రవేశించిన ఘటన సంచలనంగా మారడంతో సోమవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ జూబ్లీహిల్స్‌లోని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు వచ్చిన మార్గాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరుతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు అందజేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరితో పాటు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డిలతో మాట్లాడి భద్రతను పెంచాలని ఆదేశించారు.