సిటీ బ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిలో చాలా మందిని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు, బలపరిచిన వ్యక్తుల వివరాలు సరిగ్గా లేవంటూ కొంతమంది నామినేషన్లు తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. వారిని పోలీసుల ద్వారా బయటకు పంపించేశారు. దీంతో మంగళవారం ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అన్ని పత్రాలు సరిగ్గా ఉండి, సమయానికి ఎన్నికల అధికారి కార్యాలయానికి వచ్చినా తమ నామినేషన్ పత్రాలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. తమ నామినేషన్ తీసుకోకపోవడానికి కారణాలేంటని అడిగినా స్పందించకుండా పోలీసులు బయటకు ఈడ్చుకొచ్చారని మండిపడుతున్నారు. నామినేషన్ల సంఖ్య ఎక్కువైతే ఒత్తిడి ఉంటుందని భావించి కావాలనే తమ నామినేషన్ తీసుకోలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేస్తున్నవారిని ప్రత్యేకించి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను జూబ్లీహిల్స్ ప్రజల ముందుంచుతామనే మమ్మల్ని నామినేషన్ వేయనీయడం లేదు. ఎలాంటి కారణాలు లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారు. నామినేషన్ పత్రాలతో మధ్యాహ్నం 12 గంటలకే లోపలికి వెళ్లిన. టోకెన్ తీసుకోవాలని అధికారులు చెప్పినప్పుడు ఫామ్‌లో చిన్న ఖాళీ ఉంటే నింపుకుంటుంటే అకారణంగా నన్ను బయటకు తోసేశారు. పత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్తున్నా పోలీసులు నిర్దాక్షిణ్యంగా బయటకు ఈడ్చుకొచ్చారు. ఎందుకు బయటకు తీసుకొస్తున్నారో చెప్పాలని బతిమిలాడినా పట్టించుకోకుండా బయటకు తోసేశారు. రిటర్నింగ్ అధికారి రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యహరిస్తున్నారు. ఎన్నికల అధికారుల తీరుకు నిరసనగా నామినేషన్ పత్రాలు చించేస్తున్నా. నా నామినేషన్‌ను ఎలాంటి కారణాలు లేకుండా తిరస్కరించినందుకు రిటర్నింగ్ అధికారిపైన చట్టబద్ధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తా.
– భాస్కర్ నాయక్, ఓయూ విద్యార్థి నేత
మైనారిటీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ముస్లింలను నిలువునా మోసం చేసింది. కేబినెట్లో మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి లేకుండా అవమానించింది. కాంగ్రెస్ విధానాలకు నిరసనగా నామినేషన్ వేద్దామని అన్ని పత్రాలతో వచ్చాను. టోకెన్ కూడా ఇచ్చారు. కార్యాలయం లోపలే భోజనం చేసి వచ్చేసరికి నా సీరియల్ నెంబర్ దాటిపోయిందని బయటకు పంపించారు. టోకెన్ ఇచ్చి కూడా నామినేషన్ దాఖలు చేయకుండా ఎన్నికల అధికారులు అడ్డంకులు సృష్టించారు. పోలీసులతో నన్ను అకారణంగా బయటకు పంపించేశారు. నామినేషన్ తిరస్కరించినా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు నిర్విరామంగా పనిచేస్తాం. మైనారిటీల సత్తా ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి చూపిస్తాం.
-షేక్ కరీం, మైనారిటీ అభ్యర్థి
తెలంగాణలో కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. అన్ని పత్రాలు సమర్పించాం. నామినేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లిస్తామంటే నిరాకరించారు. క్యాష్ రూపంలోనే ఇవ్వాలంటూ నామినేషన్ తిరస్కరించారు.
– ఆర్ఎల్డీ పార్టీ ప్రతినిధులు
బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి నామినేషన్‌ను వరుసలో నిల్చున్న వారందరినీ పక్కన పెట్టి లోపలికి వెళ్లిన వెంటనే స్వీకరించారు. దీపక్‌రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు తదితరులు లోపలికి వెళ్లారు. ఉదయం నుంచి క్యూలో నిలబడ్డవారిని కాదని, అప్పుడే వచ్చిన దీపక్‌రెడ్డి నామినేషన్ ఎలా తీసుకుంటారని వారంతా రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా వ్యవహిరస్తున్నారని ఆరోపించారు. ఈసీ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.