Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. 16న ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థా యిలో ముగియనుంది.
షేక్‌పేట ఎమ్మా ర్వో కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సన్నద్ధతను ఆర్వో, ఏఆర్వోలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈసీఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంకు సూచించారు.
సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్లు స్వీకరించే సమయం నుంచి ఆన్లైన్ ద్వారా నామినేషన్ పత్రాలను డౌన్లోడ్ చేసుకొని, ఆన్లైన్లోనే వివరాలు నమోదు చేయవచ్చు. అయితే ఆన్లైన్ ద్వారా భర్తీ చేసినప్పటికీ స్వయంగా అభ్యర్థి హాజరు కావాల్సి ఉం టుంది. సంతకం, ప్రమాణం కోసం తప్పనిసరి. నామినేషన్ల స్వీకరణ గడువు సమయం ముగిసేలోగా హాజరు కావాల్సి ఉంటుంది.
ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతా గోపీనాథ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఇక నేడో రేపో బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.