సిటీబ్యూరో, అక్టోబరు 9 (నమస్తే తెలంగాణ ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచార వ్యూహానికి బీఆర్ఎస్ మరింత పదును పెట్టింది. ఇప్పటికే నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఒకవైపు సమావేశాలు మరోవైపు చేరికలతో జోరుమీదున్నది గులాబీ పార్టీ. అన్ని పార్టీల కంటే ముందుగానే పార్టీ అభ్యర్థిని ప్రకటించి బలమైన పార్టీగా నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ కుటుంబ సభ్యులు బస్తీలు, కాలనీల్లో కలియతిరుగుతూ ప్రజల మద్దతును కోరుతుండగా, జనం వీరి ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారు.
ఐతే ఉప ఎన్నికకు సంబంధించి ఈనెల 6వ తేదీన నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పోలింగ్ నాటికి ప్రచార పర్వాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే క్యాంపెయిన్, పార్టీ నేతలు, ప్రచార బృందాల నడుమ సమన్వయం తదితరాల కోసం ‘వార్ రూమ్’ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ఇన్‌చార్జ్జిలుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, వ్యవహరిస్తారు. ఈనెల 12వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
నియోజకవర్గంలో ఇప్పటికే డివిజన్ ఇన్‌చార్జీలుగా ప్రజాప్రతినిధులు మాధవరం కృష్ణారావు, వివేకానంద్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ముఠా గోపాల్, తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించనున్నారు. బూత్‌లవారీగా కార్పొరేటర్లకు బాధ్యతలు అప్పగించారు. ప్రచారాలు, కాలనీల వారీగా సమావేశాలను ఉదృతం చేశారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు బూత్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నది. ఇందులో బీఆర్ఎస్ ప్రచార బృందాల పనితీరు, రోడ్‌షోలు, రోజువారీ ప్రచార షెడ్యూల్ తదితర అంశాలపై చర్చించి, వార్‌రూమ్ నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా ప్రచార వ్యూహానికి పదును పెట్టనున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తిరిగి గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు ముమ్మరం చేసింది. బూత్ స్థాయిలో బలమైన క్యాడర్‌తో ఉండగా, మాగంటి సునీతా గోపినాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకునేలా డివిజన్ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్ అన్ని డివిజన్ల నేతలతో సమావేశమై దిశానిర్ధేశం చేశారు. ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మరో వైపు కలిసివచ్చే ఇతర పార్టీల నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈక్రమంలో ఇటీవల టీడీపీ నేత ప్రదీప్ చౌదరికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఇదే బాటలో జాతీయ పార్టీల నుంచి మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని స్థానిక నేతలు పేర్కొంటున్నారు.