సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా జూబ్లీహిల్స్ వేదిక సాగుతున్న ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అభ్యర్థుల ఖరారు నుంచి నామినేషన్ల పరిశీలన వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ బరిలో నిలిపిన అభ్యర్థి నవీన్ యాదవ్కు ముచ్చెమటలు పట్టించేలా పోటాపోటీగా వచ్చిన వందలాది నామినేషన్లతో ఆ పార్టీ అగ్ర నేతలు తలలు పట్టుకున్నారు. వేలాది మంది రైతులు ట్రిపులార్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ పొట్ట కొడుతుందని నామినేషన్లు వేశారు.
ఇక రెండేళ్ల పాలనలో కేవలం నియామకాలను మరిచి కేవలం నియామక పత్రాల పంపిణీకి పరిమితమైందని, ఎన్నికల హామీలో చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదని ఆరోపిస్తూ నిరుద్యోగులు మరోవైపుతోపాటు, నలువైపులా కాంగ్రెస్ పార్టీపై దాడి చేసినట్లుగా ఫార్మా సిటీ రైతులతోపాటు, ప్రభుత్వ విధానాలు, రేవంత్ సర్కారు అవినీతి బాగోతాలను భరించలేక పలు ప్రజా సంఘాలు, జీవిత కాలం ప్రభుత్వ ఉద్యోగులకు సేవలు అందిస్తే కనీసం పదవీ విరమణ ప్రయోజనాలు లేకుండా చేస్తున్న కాంగ్రెస్ దరిద్రపు పాలనకు ఎండగడుతూ రిటైర్డ్ ఉద్యోగులతో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది.
దేశంలో అరుదుగా ఒక్క స్థానానికి 211 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా.. అందులో 321 నామినేషన్లతో ప్రభుత్వానికి వణుకు పుట్టించారు. దీంతో ఎన్నికల అధికారులకే దిక్కులు చూసే పరిస్థితి రావడంతో.. ఈవీఎం మిషన్లపై పదుల సంఖ్యలో ఏర్పాటు చేయాల్సి వచ్చేది. వీటన్నింటిని దృష్టి పెట్టుకుని ఎన్నికల అధికారులే సాంకేతిక సమస్యల పేరిట కలానికి పదును పెట్టారు. వచ్చిన నామినేషన్లల్లోని తప్పిదాలను భూతద్దాలతో పరిశీలించి మరీ భారీగా తగ్గించడంతో వచ్చిన దరఖాస్తుల్లో 50శాతానికి పైగా నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
నిజానికి బరిలో నిలుస్తూ నామినేషన్ వేసిన ప్రతి అభ్యర్థిని ఆమోదిస్తే ఎన్నికల సంఘానికి తలకు మించిన భారం అవుతుందనే తిరస్కరణాస్ర్తాన్ని ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఆ పార్టీకి వచ్చే ఓట్లు చీలే అవకాశం ఉందనే తమ నామినేషన్లను రిజెక్ట్ చేశారని ఓ అభ్యర్థి మండిపడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఆరోపించారు. ఒకవేళ నామినేషన్ వేసిన దరఖాస్తులన్నింటిని ఆమోదిస్తే ఏకంగా 25 ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సిన వచ్చి ఉండేదని, ఇదంతా నిర్వహణ భారంగా భావించే దరఖాస్తుల వడబోత సాగిందని పలువురు అభ్యర్థులు వివరించారు.
వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు.. సాంకేతిక కారణాలను బూచిగా చూపుతూ తిరస్కరించిన వాటిలో ట్రిపులార్ రైతులవే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. లోపభూయిష్టంగా ఉన్న భూసేకరణతో చిన్న, సన్నకారు రైతుల పొట్టగొడుతున్న కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు 50 మందికి పైగా రైతులు నామినేషన్లు వేశారు. నిబంధనల పేరిట వాటిలో 70-80శాతం నామినేషన్లను కొట్టివేసినట్లుగా సమాచారం.
వందలాదిగా వచ్చిన నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల యంత్రాంగం దశల వారీగా తిరస్కరించింది. మొత్తం నామినేషన్లలో ఎక్కువగా వచ్చిన ట్రిపులార్, ఫార్మా రైతులతోపాటు, నిరుద్యోగ జేఏసీల నుంచి వచ్చిన నామినేషన్లకు కొర్రీలు పెట్టినట్లుగా అభ్యర్థులు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకత కోల్పోయిందనే దానికి తాజా సంఘటనలే నిదర్శమని నవతరం పార్టీ నుంచి నామినేషన్ వేసిన ఓ అభ్యర్థి వివరించారు. నిబంధనల ప్రకారం తన ఓటర్ వివరాలను ధ్రువీకరించినా కూడా ఇక్కడ తమకేమి పట్టదని, తమ వద్ద ఉన్న చెక్ లిస్ట్కి అనుగుణంగా ఉన్న నామినేషన్లను ఆమోదిస్తామని వెల్లడించిన యం త్రాంగం రాత్రి 8గంటల వరకు మొత్తం 42మంది వేసిన 79 నామినేషన్లను తిరస్కరించారు. వీటిలో మె జార్టీ కారణాలు అధికారులు చెప్పే టెక్నికల్ అంశాలేనని అభ్యర్థులు వివరించారు.