హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ (Jubilee Hills By-Election) ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి పోలింగ్ సమయాన్ని అదనంగా గంట పాటు ఎన్నికల సంఘం పొడిగించింది. మొత్తం 4,01,365 ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా, అధికారులు రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నది. బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీచేస్తున్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. తొలిసారిగా డ్రోన్ల ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు. 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఈ నెల 14న ఫలితాలు వెలువడనున్నాయి.
గుర్తింపు కార్డు తప్పనిసరి..
ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుండి ఓటర్ గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో ఐడీలలో దేనినైనా ఒకటి పోలింగ్ సిబ్బందికి చూపిం ఓటరు తమ ఓటును వినియోగించుకోవచ్చు. ఆధార్, ఉపాధి హామీ, జాబ్‌కార్డు, బ్యాంకు, తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్, కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు , నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద రిజిస్టార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు, భారతీయ పాస్‌పోర్టు ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజేబుల్ గుర్తింపు కార్డులో ఏదైనా ఒకటి చూపించాలి. ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఈ 12 కార్డులలో ఏ గుర్తింపు కార్డు ఉన్న ఓటు వేయవచ్చు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ఈ హక్కును జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు విస్మరిస్తున్నారు. కనీసం సగం మంది కూడా ఎన్నికల్లో ఓటును సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎన్నిక రోజును సెలవుదినంగా మార్చుకుని విహార యాత్రలు, ఇతర ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటూ ఓటు వేయడంలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఓటర్ల సంఖ్య పెరుగుతున్నా ఓటింగ్ శాతం కనీసం 50 శాతం దాటడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రాల దాకా ఓటర్లను రప్పించడంలో ఆయా రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయి. ఎప్పటిలాగే జిల్లా ఎన్నికల సంఘం అధికారులు ఓటర్లకు అవగాహన, చైతన్యం కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేసి సద్వినియోగం చేసుకోవాలంటూ స్వీప్ కార్యక్రమాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సారైనా మార్పు వచ్చేనా?
సాధారణంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో సమస్యలు పెరిగిపోవడం, అభివృద్ధి ఆశాజనకంగా లేకపోవడం, రాజకీయ పార్టీల పట్ల విముఖతనే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గడిచిన రెండేళ్లుగా ఎక్కడి వేసినా గొంగళి అక్కడే ఉన్నట్లుగా సమస్యలు అడుగడుగునా తాండవిస్తున్నాయి.నియోజకవర్గంలోని బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళ్రావు నగర్ కాలనీ, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, షేక్‌పేట, సోమాజిగూడ తదితర ఏడు డివిజన్లు ఉండగా, ఈ ఏడు డివిజన్లలో వెంగళ్రావునగర్లో మాత్రమే ఎగువ, మధ్య తరగతి కాలనీలు ఉండగా, మిగిలిన అన్ని ప్రాంతాల్లో బస్తీలు, మురికివాడలు, సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు నివసిస్తున్నారు.
అయితే ఏ బస్తీల్లో, ఏ కాలనీలో చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా దెబ్బ తిన్న రహదారులు, పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోళ్లు, పడకేసిన పారిశుద్ధ్యం, వీధికుక్కల బెడద, దోమల స్వైర విహారం, నీటి ఎద్దడి, ఫుట్‌పాత్ ఆక్రమణలతో ట్రాఫిక్ జామ్ ఇలా అనేక సమస్యలతో నియోజకవర్గ ప్రజలు సతమతమవుతున్నారు. ఈ తరుణంలోనే రెండేళ్ల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, ఓటు ద్వారా గుణపాఠం చెబుతామన్న చర్చల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
