అమీర్‌పేట్, అక్టోబర్ 11 ః సరిగ్గా దశాబ్ద కాలం క్రితం కనీస సదుపాయాలకు కూడా నోచుకోలేని రాజీవ్‌నగర్‌ను, ఇప్పుడున్న రాజీవ్‌నగర్‌తో పోల్చి చూస్తే.. ఎక్కడా పొంతన కుదరదని కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు క్రిష్ణ శర్మ, వినాయక సాగర్లు పేర్కొన్నారు. దశాబ్ద కాలంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో మౌళిక వసతుల కల్పనకు ఎంతో చొరవ తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. శనివారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ కాలనీకి విచ్చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ముందు గోపీనాథ్‌తో తమ అనుబంధాన్ని నెమరవేసుకున్నారు.
రాజీవ్‌నగర్ కాలనీ పార్కులు, వరదనీటి కాలువలు, రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి వ్యవస్థల ఆధునీకరణకు తాము అడిగిందే తడవుగా.. నిధుల వరద పారించారని వారు గుర్తు చేశారు. ఒక్క రాజీవ్‌నగర్‌కే గత దశాబ్ద కాలంలో దాదాపు 4.5 నుండి 5 కోట్ల వరకు నిధులు సమకూర్చి అభివృద్ధికి పెద్దపీట వేశారని, రాజకీయ అవసరాలు, ఆలోచనలకు తావు లేకుండా వయోధికులమైన తాము కాలనీ వసతుల కల్పనకు సంబంధించి అడిగిన ఏ పనికీ అడ్డు చెప్పలేదని వారన్నారు.
ఊహించని విధంగా వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో మాగంటి తమ కాలనీ ప్రగతికి అందించిన సహకారాన్ని కాలనీవాసులు ఎన్నటికీ మరువరని, వారి సతీమణి మాగంటి సునీతకు కాలనీవాసుల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి రాజీవ్‌నగర్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు సంజీవతో పాటు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
కాలనీవాసులతో మమేకమవుతూ..
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సేవలను దృష్టిలో పెట్టుకుని త్వరలో జరుగబోతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ చేస్తున్న ప్రచారం కాలనీవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తన ప్రచారంలో భాగంగా అభ్యర్ధి మాగంటి సునీతా గోపీనాథ్ ప్రజల్లోకి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. శనివారం ఉదయం ఎర్రగడ్డ డివిజన్లోని బ్రిగేడ్ సిటడెల్ గేటెడ్ కమ్యూనిటీలో మార్నింగ్ వాక్‌లో ఉన్న స్థానికులను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా తమ కమ్యూనిటీలోకి వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీతకు వాకర్లు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యే మాగంటితో తమకున్న అనుబంధాన్ని నెమరవేసుకుంటూ బ్రిగేడ్ సిటడెల్ మొత్తాన్ని సందర్శించారు. అనంతరం వాసవి బృందావనం, జనప్రియ, కల్పతరు, లక్ష్మి కాంప్లెక్స్‌లలో మాగంటి సునీత తన కుమారుడు వాత్సల్యనాథ్, కుమార్తె దిశిరలతో కలిసి నిర్వహించిన ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చింది.