Hyderabad | కుత్బుల్లాపూర్, డిసెంబర్ 17: సరోజిని గార్డెన్లో బహుళ అంతస్తుల నిర్మాణం కోసం యూఎల్సీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల విలేజ్ గాంధీ విగ్రహం సమీపంలోని సరోజిని గార్డెన్ సర్వే నం.48లో దాదాపుగా 5,807 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ స్థలం(యూఎల్సీ) ఆక్రమణకు గురైందని స్థానికులు తెలిపారు. 1976 యూఎల్సీ చట్టం ప్రకారం సర్వే నం.48లో ఉన్న స్థలానికి ఓ నిర్మాణ సంస్థ నకిలీ పత్రాలను సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించడంతో పాటు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందటం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో మంగళవారం కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు యూఎల్సీ భూమిలో ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేశారు. కాగా ఈ విషయంపై మండల తాసీల్దార్ అబ్దుల్ రెహమాన్‌ను వివరణ కోరగా.. సరోజిని గార్డెన్ సర్వే నం. 48లో యూఎల్సీ ప్రభుత్వ స్థలం ఉన్నది వాస్తవమేనన్నారు. ఈ మేరకు త్వరలోనే సర్వే చేపట్టి ఆ స్థలాన్ని గుర్తించి హద్దులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అప్పటి వరకు ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నిర్మాణదారులకు సూచించినట్లు తెలిపారు.
కాగా సుచిత్ర నుంచి కొంపల్లి వైపునకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి-44కి ఆనుకొని ఉన్న ఫుట్‌పాత్‌ను సరోజిని గార్డెన్లో జరుగుతున్న నిర్మాణం కోసం టిప్పర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు నిర్మాణదారులు అక్రమంగా ఫుట్‌పాత్‌ను ధ్వంసం చేశారు. ఓ వైపు రోడ్డు వెడల్పు, జంక్షన్ల అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఫుట్‌పాత్‌ను నిర్మాణదారులు తొలగించడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై అల్వాల్ ట్రాఫిక్ సీఐ నాగరాజుని వివరణ కోరగా.. ఫుట్‌పాత్ నిర్మాణం కూల్చివేతల పై తమకు ఎలాంటి సమాచారం రాలేదని, ఇష్టానుసారంగా ఫుట్‌పాత్‌లను తొలగించడం చట్టవ్యతిరేక చర్య అన్నారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు.